CEC నియామకంపై విచారణ వాయిదా

న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి), ఎన్నికల కమిషనర్ల (ఇసి) నియామకానికి సంబంధించిన చట్టం చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు బుధవారం వాయిదా వేసింది. సిఇసి, ఇసి నియామక ప్యానెల్‌లో గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సైతం ఉండేవారు. అయితే, కేంద్ర ప్రభుత్వం గతేడాది సిజెఐను తొలగించి.. ఆ స్థానంలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి చోటు కల్పించింది. ఈ మేరకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి.. చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. కొత్త చట్టాన్ని సవాల్‌ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై ఫిబ్రవరి 19న విచారిస్తామని కోర్టు ప్రకటించింది.
బుధవారం విచారణలో ఎన్‌జీఓ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌.. జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌ ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు.

బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్‌ కుమార్‌

26వ సిఇసిగా జ్ఞానేశ్‌ కుమార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సిఇసిగా జ్ఞానేష్‌ కుమార్‌ను కేంద్రం ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. ఆయన గతేడాది సహకార మంత్రిత్వ శాఖలో పని చేస్తూ పదవీ విరమణ చేశారు. ప్రస్తుత సిఇసి రాజీవ్‌ కుమార్‌ మంగళవారం పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే.

➡️