ఘనంగా గణతంత్ర దినోత్సవం

Jan 27,2024 08:40 #Happy Republic Day
  • కర్తవ్యపథ్‌ పై మువ్వన్నెల జెండా రెపరెపలు
  • జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి
  • ముఖ్య అతిథిగా ఫ్రెంచ్‌ అధ్యక్షులు మాక్రాన్‌
  • నారీ శక్తిని చాటేలా సాగిన పరేడ్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత నారీశక్తిని చాటేలా పరేడ్‌ సాగింది. కత్తితో కవాతు చేయడం మొదలు… సాంప్రదాయ బ్యాండ్ల వాయిస్తూ, రక్షణ వ్యవస్థలను లీడ్‌ చేస్తూ, రాష్ట్ర/కేంద్ర శకటాలను వివరిస్తూ, మోటర్‌ బైక్స్‌ పై ఒళ్లు గగురుపొడిచేల విన్యాసాలతో మహిళలు తమ శక్తియుక్తులను ప్రదర్శించారు. కాగా 40 ఏళ్ల తరువాత గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సారి వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్‌ అధ్యక్షులు ఇమాన్యూవల్‌ మాక్రాన్‌ హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, పెద్ద సంఖ్యలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

తొలిసారి 112 మంది మహిళా కళాకారులు భారతీయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ.. పరేడ్‌ ను ప్రారంభించారు. అనంతరం ప్రారంభమైన కవాతు దేశ నారీ శక్తిని చాటింది. త్రివిధ దళాలు, పారా మిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీస్‌, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ కంటింజెంట్లకు మహిళలు సారథ్యం వహించడం ఈ వేడుకల్లో విశేషం. త్రివిధ దళాలు భారత అమ్ముల పొదిలోని అత్యాధునిక ఆయుధాలు, యుద్ద ట్యాంకులు, అణ్వాయుధాలను ప్రదర్శించించాయి. నాగ్‌ మిస్సైల్‌ వ్యవస్థ, మొబైల్‌ మైక్రో వేవ్‌, బిఎంపి 2/2, ఆల్‌ టెర్రియన్‌ వెహికల్స్‌, పణిక, సర్వత్ర మొబైల్‌ బ్రైడింగ్‌ సిస్టం సగర్వంగా ముందుకు సాగాయి. అలాగే సిగల్‌ వ్యవస్థ, డ్రోన్‌ జామర్‌ సిస్టం, అడ్వాన్స్‌ రేడియో ప్రిక్వెన్సీ మానిటరింగ్‌ సిస్టం, సర్ఫేస్‌ ఎయిర్‌ మిజెస్‌ సిస్టం, మూడు అత్యాధునిక రుద్ర, ఒక ప్రచండ హెలికాప్టర్స్‌ ను ఈ వేడుకల్లో ప్రదర్శించారు.

‘ప్రజాస్వామ్య తల్లి’ (మథర్‌ ఆఫ్‌ డెమోక్రసీ) నేపథ్యంతో మొత్తం 25 శకటాలను కర్తవ్యపథ్‌ పై సందడి చేశాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 9 శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ద్విభాషా పుస్తకాలు, ట్యాబ్‌లు పట్టుకున్న విద్యార్థులను ప్రధానంగా విద్యా రంగానికి విశేష ప్రాధాన్యతనిస్తూ శకటాన్ని రూపొందించారు. తెలంగాణలో గిరిజన మహిళల చైతన్యాన్ని ప్రతిబింబిస్తూ శకటాన్ని ప్రదర్శించారు. తమిళనాడు చోళ సామ్రాజ్యపు నాటి మహిళ ధీరత్వాన్ని ప్రదర్శించగా, ఉత్తరప్రదేశ్‌ ‘అయోధ్య బాలక్‌ రామ్‌’ థీమ్‌తో శకటాన్ని ప్రదర్శించి ఇక్కడ కూడా మతతత్వ రంగు పులుముకుంది. శకటాల ప్రదర్శన అనంతరం 54 యుద్ద విమానాలు, హెలికాప్టర్లు నింగిలో విన్యాసాలు చేశాయి.

 

➡️