- పాత పద్ధతుల్లో విజయాలు అసాధ్యం
- కాలానుగుణ మార్పులతోనే భవిత
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : హర్యానా, మహారాష్ట్ర అసెంబీల్లో ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లోని నాయకత్వంలో నెలకొన్న అనైక్యత వల్లే ఓటమి చవిచూడాల్సివచ్చిందని కాంగ్రెస్ అధినాయకత్వం విశ్లేంషించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వాన ఎఐసిసి ప్రధానకార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కెసి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సమీక్ష సమావేశంలో తాజా అంసెబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యం, క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యలు, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకం చర్చించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పాత పద్ధతుల్లో ప్రచారాలు సాగించడం, వ్యూహాలు పన్నడం విజయాలను అందించలేవని, కాలానుగుణ మార్పులకు అనుగుణంగా మారితేనే ముందుకెళ్లగలమని పార్టీ శ్రేణులకు ఖర్గే నిర్దేశించారు. తక్షణమే పాఠాలు నేర్చుకుని, సంస్థాగత స్థాయిలో బలహీనతలు, లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికల ప్రక్రియ అనుమానాస్పదం…!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎం) ఎన్నికల ప్రక్రియను అనుమానాస్పదంగా మార్చాయని నమ్ముతున్నట్లు ఖర్గే చెప్పారు. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం ఎన్నికల సంఘం రాజ్యాంగ బాధ్యత అని నొక్కి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ(ఎంవిఎ) కూటమి సాధించిన ఫలితాలు తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాజకీయ పండితులను గందరగోళంలో పడేశాయన్నారు. బిజెపి పాలనలో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలను పెరిగిపోయాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని ఆయన అన్నారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. కుల గణన కూడా ముఖ్యమైన అంశమని ఆయన చెప్పారు.
బ్యాలెట్ పేపర్ విధానాన్ని పునురుద్ధరించాలి : పల్లంరాజు
బ్యాలెట్ పేపర్ విధానం తీసుకురావాలనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు సీనియర్ నేత పల్లం రాజు తెలిపారు. సమావేశ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇవిఎం, వివి ప్యాట్ ట్యాలీ అయ్యే విధానం తీసుకురావాలన్సిన అవసరం ఉందన్నారు. వైఫల్యాలు నేర్పిన పాఠాలతో రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామన్నారు.