హెచ్‌డి రేవణ్ణ బెయిల్‌పై విడుదల

May 15,2024 00:29 #bail, #HD Revanna

బెంగళూరు : కిడ్నాప్‌ కేసులో బెయిల్‌ లభించడంతో కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డి రేవణ్ణ మంగళవారం మధ్యాహ్నం పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. బయటకు వచ్చిన రేవణ్ణకు పెద్ద సంఖ్యలో జెడి(ఎస్‌) కార్యకర్తలు స్వాగతం పలికారు. జైలు నుంచి నేరుగా ఈ నెల 4న తనను అరెస్టు చేసిన, పద్మనాభనగర్‌లోని తన తండ్రి, మాజీ ప్రధాని దేవగౌడ ఇంటికి రేవణ్ణ చేరుకున్నారు. నివాసం బయట పెద్ద సంఖ్యలో జెడి(ఎస్‌) కార్యకర్తలు గుమిగూడి ఉండగా, రేవణ్ణ లోపల తన సోదరుడు, జెడి(ఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు హెచ్‌డి కుమారస్వామితో కలిసి ఉన్నారు. బుధవారం తన స్వగ్రామం, తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హోలెనరసిపూర్‌ నియోజకవర్గానికి రేవణ్ణ వెళ్లనున్నారు. తన కుమారుడు, జెడి(ఎస్‌) ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో బాధితురాల్ని కిడ్నాప్‌ చేశారనే ఆరోపణలతో హెచ్‌డి రేవణ్ణను అరెస్టు చేశారు. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు రేవణ్ణకు సోమవారం సాయంత్రం బెయిల్‌ మంజారు చేసింది.

➡️