ఐదేళ్ల నిర్బంధం నుంచి విడుదలైన రెండు రోజుల్లోనే మళ్లీ అరెస్టు

  • కాశ్మీరీ జర్నలిస్టు ఆసిఫ్‌పై పోలీసుల కక్షసాధింపు

శ్రీనగర్‌ : ఐదేళ్ల నిర్భంధం నుంచి విడుదలైన రెండు రోజుల్లోనే కాశ్మీరీ జర్నలిస్టు ఆసిఫ్‌ సుల్తాన్‌ను పోలీసులు మరొక కేసులో మళ్లీ అరెస్టు చేశారు. గురువారం ఆసిఫ్‌ సుల్తాన్‌ను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం శ్రీనగర్‌లోని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఉపా చట్టం కింద 2018 సెప్టెంబరులో ఆసిఫ్‌ను అరెస్టు చేశారు. ఏ ఉగ్రవాద సంస్థలతో గానీ, ఉగ్రవాదులతో కానీ సుల్తాన్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో జమ్ముకాశ్మీర్‌ హైకోర్టు ఏప్రిల్‌ 5, 2022లో బెయిల్‌ మంజారు చేసింది. పోలీసు అధికారులు సుల్తాన్‌ను విడుదల చేయకుండా ప్రజా భద్రతా చట్టం (పిఎస్‌ఎ) కింద నిర్బంధంలో ఉంచారు. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌ నగర్‌ జిల్లా జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు. మంగళవారం విడుదలైన సుల్తాన్‌ గురువారమే శ్రీనగర్‌లోని ఇంటికి చేరుకున్నారు. గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కొద్ది సేపు విచారించిన తరువాత మళ్లీ సుల్తాన్‌ను అరెస్టు చేశారు. ఆసిఫ్‌ సుల్తాన్‌పై కొత్తగా నమోదు చేసిన కేసు 2019లో శ్రీనగర్‌ సెంట్రల్‌ జైల్లో ఖైదీలకు మధ్య జరిగిన ఘర్షణలకు సంబంధించినదిగా తెలుస్తోంది. శ్రీనగర్‌లోని కాశ్మీర్‌ నెరేటర్‌ ఆంగ్ల మాస పత్రికలో జర్నలిస్టుగా పనిచేసిన సుల్తాన్‌ 2019లో జాన్‌ అబుచోన్‌ ప్రెస్‌ ఫ్రీడం అవార్డును గెలుచుకున్నారు.

➡️