విద్యార్థి నాయకులు గుల్ఫిషా ఫాతిమా, ఖలీద్ సైఫీలవి కూడా..
న్యూఢిల్లీ : ఉపా చట్టం కింద అరెస్టయిన ఉమర్ ఖలీద్‌తో పాటు గుల్ఫిషా ఫాతిమా, ఖాలీద్ సైఫీల బెయిల్ పిటిషన్‌పై డిసెంబరు 6న విచారణ జరగనున్నది. న్యాయమూర్తులు జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ శైలిందర్ కౌర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం దీనిని చేపట్టనున్నది. 2020లో ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఉపా కింద ఈ ముగ్గురూ కేసులను ఎదుర్కొంటున్నారు. తాము సుదీర్ఘ కాలం జైలులో ఉన్నామనీ, దానిని పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వారు ఈ పిటిషన్‌ను వేశారు. వాస్తవానికి ఉమర్ ఖాలీద్ బెయిల్ పిటిషన్‌ను ఈ ధర్మాసనం అక్టోబర్ 7న చేపట్టాల్సి ఉన్నది. కానీ, బెంచ్ సమావేశం విఫలం కావటంతో అది సాధ్యపడలేదు. ఆ తర్వాత పిటిషన్ విచారణ నవంబర్ 25కు జాబితా చేయబడింది. ఈ ఏడాది సెప్టెంబర్ 14తో ఉమర్ ఖాలీద్ నాలుగేండ్లు జైలులో గడిపినట్టయ్యింది. బెయిల్ కోసం దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పలుమార్లు ఉమర్ ఖాలీద్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఏడాది మే 28న దిగువ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. నాలుగేళ్లలో సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ 14 సార్లు ఆలస్యమైంది. ఆ తర్వాత ఆయన ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉమర్ ఖాలీద్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్.. దిగువ న్యాయస్థానంలో దాఖలుచేసేందుకు సుప్రీంకోర్టు నుంచి పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.