శివశంకర్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో శివశంకర్‌రెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. శివశంకర్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలన్న వైఎస్‌ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజరు కుమార్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. సునీత తరపున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. శివశంకర్‌రెడ్డి బెయిల్‌ రద్దుతోపాటు, మిగిలిన నిందితులపై దాఖలైని పిటిషన్‌లన్నీ కలిపి విచారించాలని కోరారు. మిగిలిన నిందితులపై దాఖలైన పిటిషన్‌లు నవంబరు 4న లిస్ట్‌ అయినట్లు రిజిస్ట్రీలో చూపుతోందని అందుకని, అన్ని కలిపి నవంబరు 5న ఒకేసారి విచారణ చేపట్టాలని కోరారు. శివశంకర్‌ రెడ్డి కొడుకు జైలులో ఉన్న అప్రూవర్‌ను బెదిరించిన వ్యవహారం, వైఎస్‌ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌లను కూడా కలిపి విచారించాలని కోరారు. శివశంకర్‌ రెడ్డి కొడుకు జైలులో బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్‌ అయ్యేందుకు అనుమతించాలని సిద్దార్థ లూథ్రా కోరారు. సునీత తరపున విజ్ఞప్తులను ధర్మాసనం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదిగా ఉందని, బెయిల్‌ రద్దుకు బెదిరించిన విషయానికి సంబంధం లేదని, వేర్వేరుగా విచారించాలని శివశంకర్‌ రెడ్డి తరపున న్యాయవాది రంజిత్‌ కుమార్‌ కోరారు. నవంబరు 5న అన్ని పిటిషన్లు ఒకేసారి విచారణ చేపడతామని, బాధితులే కోరుతున్నారు కాబట్టి, అదేరోజు విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.

➡️