ఢిల్లీ: మసీదు శిథిలాల మీద ఆలయం నిర్మించబడిందో లేదో నిర్ధారించుకోవడానికి సివిల్ కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా సంభాల్ షాహి జామా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం నేడు విచారించనుంది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా అంతటా హింస, మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తూ నవంబర్ 19న స్థానిక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హింసాకాండలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. న్యాయవాది కమీషనర్ సర్వే కోసం స్థానిక కోర్టు ఆర్డర్‌ను హడావుడిగా ఆమోదించారని కమిటీ వాదించింది. మొఘల్ చక్రవర్తి బాబర్ 1526లో చందౌసిలోని ఆలయాన్ని కూల్చివేసి షాహీ జామా మసీదును నిర్మించారని వాదించారు. సర్వేకు ఆదేశించిన తీరు వారణాసిలోని జ్ఞాన్‌వాపీ, మథురలోని షాహీ ఈద్గా కేసుల్లోనూ ఇదే సారుప్యతను చూడొచ్చని వారు అంటున్నారు. దీంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలకు గురి చేస్తున్నాయని కమిటీ పేర్కొంది. అన్ని మతాలకు చెందిన మత స్థలాల గుర్తింపును రక్షించే ప్రార్థనా స్థలాల చట్టాన్ని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో అసాధారణ పరిస్థితి కారణంగా కమిటీ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొంది.