చెన్నై: తమిళనాడులోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే నాగపట్నం, మైలాడుతురై, తిరువారూర్‌తో సహా పలు ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. తిరుచ్చి, పుదుకోట్టై, అరియలూర్‌లలో కూడా సెలవు ప్రకటించారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారిందని, నేడు మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో మద్రాసు యూనివర్సిటీ ఈరోజు జరగాల్సిన పరీక్షలను పరీక్షలను వాయిదా వేసింది. తిరువళ్లూరు జిల్లాలో భారీ వర్షం కారణంగా, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అందువల్ల ఈ రోజు నిర్వహించాల్సిన విశ్వవిద్యాలయ పరీక్షలు వాయిదా వేయబడ్డాయి. మార్పు చేసిన తేదీ తర్వాత తెలియజేస్తామని పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రకారం, పాలిటెక్నిక్ కాలేజీలకు షెడ్యూల్ చేయబడిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయని తెలిపారు. బుధవారం ఉదయం 5.30 గంటల వరకు నాగపట్నంలో అత్యధికంగా 16.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కారైకాల్, కడలూరు (ఒక్కొక్కటి 9 సెం.మీ.), చెన్నైలోని ఎన్నూర్ (8 సెం.మీ.)తో సహా అనేక ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. చెన్నై, నాగపట్నం, కడలూరు, తిరువారూర్ సహా 15 జిల్లాల్లో ఉదయం 10 గంటల వరకు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం చెన్నై అంచనా వేసింది.