- వారానికి 90 గంటల పనితో కష్టమే
- గుండె జబ్బులు, మధుమేహం పెరిగే ప్రమాదం
- ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యల కథనాలపై వైద్యులు
న్యూఢిల్లీ : భారత్‌లోని ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని కోరుకుంటున్నట్టు ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్.ఎన్ సుబ్రమణియన్ వ్యాఖ్యలు చేసినట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆ వ్యాఖ్యలకు సంబంధించిన కథనాలపై ఉద్యోగులు, కార్మికులతో ఇప్పటికే చర్చ నడుస్తున్నది. ‘వారానికి 90 గంటల పని’పై తీవ్ర వ్యతిరేకతను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇటు వైద్య, ఆరోగ్య నిపుణులు సైతం ప్రతికూలంగానే స్పందిస్తున్నారు. ఈ పని విధానం మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అంటున్నారు.
వారానికి 90 గంటలు అంటే, రోజుకు సగటున 13 గంటలు పనిచేయటం. దీనితో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన పరిణామాలుంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. మిగిలిన 11 గంటలలో నిద్ర, ఇతర పనులు, ప్రయాణం, సంబంధాల బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ తీవ్రమైన పనిభారం అన్ని సమయాల్లో ఒత్తిడి స్థాయిలు, పేలవమైన నిద్ర, విశ్రాంతి లేకపోవటం, అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లతో ముడి పడి ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. గుండెజబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల భారంతో ఇప్పటికే పోరాడుతున్న భారతీయులకు ఈ పని ఒత్తిడి భారం మరింత నష్టాన్ని చేకూరుస్తుందని చెప్తున్నారు.
వారానికి 55 లేదా అంతకంటే ఎక్కువ గంటలు పని చేయటం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 35 శాతం, గుండె జబ్బులతో మరణించే ప్రమాదం 17 శాతం పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అధ్యయనం సమాచారం. ”ఎక్కువ పని గంటలతో దీర్ఘకాలిక ఒత్తిడి వస్తుంది. ఇది కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక అధిక రక్తపోటు, గుండెపోటులు, స్ట్రోక్‌లు గుండె వైఫల్యానికి కారకాలు” అని ప్రముఖ వైద్యులు, గుండె, ఊపిరితిత్తుల మార్పిడి సర్జన్ డాక్టర్ ముకేశ్ గోయెల్ అన్నారు.
ఎక్కువ పని గంటల కారణంగా డయాబెటిస్ ప్రమాదాలు పెరిగే అవకాశమున్నదని వైద్యులు అంటున్నారు. పనిలో ఎక్కువ గంటలు ఉన్న సమయంలో భోజనంపై శ్రద్ధ ఉండకపోవచ్చనీ, దీంతో రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు కారణమవుతుందని ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ వైద్యులు సప్తర్షి భట్టాచార్య చెప్తున్నారు. వారానికి 45 గంటలు లేదా అంతకంటే ఎక్కువగా పని చేసిన మహిళలకు వారానికి 35-40 గంటలు పని చేసినవారి కంటే మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నదని ఒక అధ్యయనం వెల్లడించింది. ఒత్తిడితో పాటు నిద్రలేమి, శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర చాలా అవసరమనీ, ఆ సమయంలో శరీరం రోజంతా కణాలలో పేరుకుపోయే చెడును తొలగిస్తుందని డాక్టర్ గోయెల్ అన్నారు. నిద్రలేమితో రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందనీ,బరువు పెరగటం, హర్మోన్ల అసమతుల్యత, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటం వంటికి దారి తీస్తుందని చెప్పారు. సంతానోత్పత్తి పైనా ప్రభావితం చేస్తుందన్నారు. పని భారం కారణంగా మానసిక ఆరోగ్యం కూడా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటుందని డాక్టర్ గోయెల్ చెప్పారు.
ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలకు సిఐటియు ఖండన
వారానికి 90 గంటలు పని చేయాలన్న నిబంధనను ప్రవేశపెట్టడంపై ఎల్ అండ్ టి చైర్మన్ చేసిన వ్యాఖ్యలను సిఐటియు తీవ్రంగా ఖండించింది. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌టియు) డిమాండ్ ప్రకారం రోజుకు 7గంటలు చొప్పున పనిగంటలు, వారానికి ఐదు రోజులు చొప్పున పనిదినాలు వుండాలని సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. తద్వారా కార్పొరేట్ రంగ యజమానులు చేసే దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొనాలన్నారు. చైనా, యూరప్, అమెరికా వంటి దేశాలతో పోల్చుకుంటే భారతీయ కార్మికులు ఇప్పటికే ఎక్కువ పనిగంటలు చేస్తున్నారని అన్నారు. సుదీర్ఘంగా పనిచేయడం వల్ల అది కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని, సామాజిక జీవనాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందన్నారు. ఇటువంటి దారుణమైన ప్రతిపాదనలు, సూచనలు చేయడం ద్వారా ఉపాధిని, అలాగే లేబర్ వ్యయాన్ని మరింత తగ్గించడానికి కార్పొరేట్ యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. తమ లాభాలు పెంచుకోవడానికి, ఖర్చులు తగ్గించుకోవడానికి వారు సమర్ధత, ఉత్పాదకత వంటి పదాల ముసుగులో కార్మికులను మరింత దారుణంగా దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తపన్‌సేన్ విమర్శించారు. ఇటువంటి శ్రమ దోపిడీ కారణంగానే 2022లో క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం 11,486మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి దారి తీసిందన్నారు. నికర విలువ జోడింపులో వేతనాల వాటా 1990-91లో 27.64శాతంగా వుండగా, 2022-23నాటికి దారుణంగా 15.94శాతానికి పడిపోయిందని, దీన్ని బట్టి అమానవీయమైన రీతిలో కార్మిక దోపిడీ ఏ మేరకు వుందో తెలుస్తోందన్నారు. ఇదే కాలంలో వార్షిక పారిశ్రామిక సర్వే నివేదిక ప్రకారం లాభాల వాటా మాత్రం 19.06శాతం నుండి 51.92శాతానికి ఎగిసిందన్నారు. దీనికి తోడు నిరుద్యోగం కూడా పెరిగిందన్నారు. పెట్టుబడిదారీ వర్గం చేసే ఇటువంటి అనారోగ్యకరమైన పోటీలను అన్ని వర్గాలకు చెందిన కార్మికులు ముక్త కంఠంతో ఖండించాలని సిఐటియు కోరింది. మౌలిక కార్మిక హక్కులపై వారి సామాజిక జీవితాలపై జరిగే కుట్రపూరిత దాడులకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా పని ప్రదేశాల్లో సమైక్య ప్రతిఘటనకు సిద్ధం కావాలని పిలుపిచ్చింది.