Hemant Soren : జార్ఖండ్‌ని నిమ్మకాయ పిండినట్టు పిండేశారు

రాంచీ : గత రెండు దశాబ్దాలుగా బిజెపి జార్ఖండ్‌ రాష్ట్రాన్ని నిమ్మకాయ పిండినట్టు పిండేసిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ విమర్శించారు. బిజెపి పేద రాష్ట్రాల వెన్నెముకని విరిచేసింది అని అన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హేమంత్‌ సోరెన్‌ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలను తమవైపుకి తిప్పుకుని డబుల్‌ ఇజన్‌ ప్రభుత్వాలను సృష్టిస్తూ.. దేశ సమాఖ్య వ్యవస్థ నిర్మాణాన్ని నాశనం చేస్తోందని సోరెన్‌ తీవ్రంగా విమర్శించారు.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘గత 20 ఏళ్లలో బిజెపి జార్ఖండ్‌ను నిమ్మకాయలా పిండేసింది. బిజెపి తీరును ఎండగట్టాలి. బిజెపి చేసే చర్యలకు ఇకనైనా ఫుల్‌స్టాప్‌ పెట్టలి. మేము ఆవుకు ఆహారం ఇస్తే.. వారు పాలు పోస్తారు. బిజెపి చర్యలు ఇకపై అనుమతించకూడదు. బిజెపి జార్ఖండ్‌ సంపదను దోచుకుంది. ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న జార్ఖండ్‌ను ఇప్పుడు పేద రాష్ట్రాల జాబితాలో చేర్చింది’ అని అన్నారు.
మాకు బొగ్గు, ఇనుప ఖనిజం, బాక్సైట్‌ డోలమైట్‌ వంటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ జిఎస్‌టి విధానం వల్ల ఆదాయ సేకరణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ విధానంతో జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల వెన్నెముకలను కేంద్రం విరిచేసింది. ఈ విధానంతో మా రాష్ట్రాల అవసరాలు ఏమీ తీరలేదు. ప్రధాని నరేంద్ర మోడీకి పదేపదే లేఖలు రాసినప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన రూ. 1.36 లక్షల కోట్ల బొగ్గు బకాయిలు ఇంకా చెల్లించలేదని సోరెన్‌ బిజెపిపై విమర్శించారు.
బిజెపి విభజన రాజకీయాలకు పాల్పడుతుంది. హిందూ – ముస్లిం అంటూ మత విభజన సృష్టిస్తూ.. కేవలం హిందూ అజెండానే వ్యవహరిస్తోంది. మత విద్వేషాలు రెచ్చగొడుతూ అధికారంలోకి వస్తుంది. బిజెపి పాలనలో ఆరోగ్యకరమైన రాజకీయపోటీ లేకపోవడం దురదృష్టకరం అని ఆయన అన్నారు.
అభివృద్ధి, నిరుద్యోగం, ఆర్థిక శ్రేయస్సు వంటి అజెండాలు బిజెపికి లేవు. కేవలం ఒకేఒక్క అజెండానే ఉంది. కేవలం విభజనే దాని అజెండా. బిజెపి నేతలు విభజన రాజకీయాల గురించే మాట్లాడతారు. మత విద్వేషాన్ని పెంపొందించడం, హిందూ- ముస్లిం అని మత విభజనను ప్రోత్సహించడమే వారు చేసే పని అని సోరెన్‌ ధ్వజమెత్తారు.
ఒక గిరిజన ముఖ్యమంత్రి ఐదేళ్లు పదవీకాలంలో ఉండడం బిజెపి జీర్ణించుకోలేకపోతోంది. తన ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకే గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహిస్తోందని ఆయన ఆరోపించారు. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను తమవైపుకి తిప్పుకుని.. వారిని వెంటాడుతూ..అధికార ప్రభుత్వాన్ని పడగొట్టి.. మళ్లీ కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీల పట్ల కేంద్రం ఓ పోచింగ్‌ మాస్టర్‌ (వేటాడే మాస్టర్‌)లా వ్యవహరిస్తోంది. కుట్రలు, దుష్ప్రచారాలతో మా ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు వారు ప్రయత్నించారు. కానీ ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది. వారి రాజకీయాలు మాపై పారలేదు అని సోరెన్‌ అన్నారు.
ఇటీవల అస్సాం ముఖ్యమంత్రి బిశ్వంత్‌ శర్మ.. జార్ఖండ్‌లో ముస్లిం జనాభా ఎందుకు పెరుగుతుంది? రాష్ట్రంలోకి అక్రమంగా చొరబడడటమే ప్రధాన కారణం అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హేమంత్‌ సోరెన్‌ స్పందించారు. ‘తమ రాష్ట్రాల్లో జరుగుతున్న వాటి గురించి ఎందుకు పట్టించుకోరు? రాష్ట్రాల రాజకీయ నిర్మాణాన్ని నాశనం చేయడానికి బయట వ్యక్తులను తీసుకువస్తారు. కొన్ని రాష్ట్రాల సిఎంలు ఇక్కడ నెలల తరబడి క్యాంపులు చేస్తారు. బూటకపు కథనాలను వ్యాప్తి చేస్తారు. వీరికి ప్రధాన ఆయుధం సోషలమీడియా. దీనికోసం బిజెపి భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. ప్రధాని మోడీ పక్క రాష్ట్రాల సిఎంలే కాదు.. అవసరమైతే జార్ఖండ్‌ రాష్ట్రాల్లో గెలవడానికి విదేశాల్లో ఉన్న స్టార్‌ క్యాంపెయినర్స్‌ని కూడా రప్పిస్తారు’ అని ఆయన అన్నారు.
వారు అధికారంలో ఉన్న మణిపూర్‌ ఎందుకు మండిపోతోంది. అక్కడెందుకు ఇప్పటికీ హింస చెలరేగుతూనే ఉంది. ఆ రాష్ట్రంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఎందుకంటే వారు ఎక్కడికక్కడ విభజనలు సృష్టించడంలో బిజీగా ఉన్నారు. డబుల్‌ ఇంజన్‌ స్థితిలో ఏం జరుగుతుందో కూడా వారు గమనించరు. వారి చెప్పుకుంటున్న డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఏం సాధించింది? విభజన, హింస తప్ప మరేమీ లేదు. జార్ఖండ్‌లోకి ముస్లింలు అక్రమంగా చొరబడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. వారు చొరబాటు పెరుగుతుందని పదేపదే చెబుతున్నారు. అలా అయితే.. దానికి ఎవరు బాధ్యత వహిస్తారని నేను అమిత్‌షాను ప్రశ్నిస్తున్నాను అని సోరెన్‌ అన్నారు.
కేంద్ర ఏజెన్సీలు
బిజెపి వ్యాపారుల పార్టీ. సిబిఐ, ఇడి కేంద్ర ఏజెన్సీలను కాషాయ దళం నియంత్రిస్తోంది. తన స్వంత పార్టీ నేతల అవినీతిని, అమ్రాలను విస్మరిస్తోంది అని జార్ఖండ్‌ సిఎం సోరెన్‌ ఇంటర్వ్యూలో అన్నారు.
యుసిసి
ఈ రాష్ట్రంలో యుసిసి అవసరం లేదు. గిరిజనులను రక్షించడానికి మాకు బలమైన నిబంధనలు ఉన్నాయి. వారు పదేపదే యుసిసి, ఎన్‌ఆర్‌సి వంటి గురించి మాట్లడతారు. కానీ సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో విఫలమయ్యారు అని సోరెన్‌ అన్నారు.

 

➡️