రాంచీ : జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సొరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ సంతోశ్ కుమార్ గంగ్వార్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి హేమంత్ బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర రాజధాని రాంచీలోని మొరాబాదీ మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతపక్షనేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి) చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీత కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కర్నాటక ఉప ముఖ్యమంత్రి డి.కె శివకుమార్, ఆర్‌జెడి నాయకులు తేజస్వీ యాదవ్ సహా పలువురు ఇండియా బ్లాక్ నేతలు హాజరయ్యారు. జార్ఖండ్‌లో వరుసగా రెండో సారి సీఎంగా గెలిచి, బాధ్యతలు చేపట్టిన ఏకైక ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కావటం గమనార్హం. 2013లో తొలిసారి ముఖ్యమంత్రిగా హేమంత్ బాధ్యతలు స్వీకరించారు. ‘ఐకమత్యమే మన ఆయుధం. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. మనల్ని ఎవరూ విభజించలేరు. మౌనంగా ఉంచలేరు. వారు(బిజెపి) మనల్ని వెనక్కి లాగితే, మనం ముందుకు వెళ్తాం. వారు మనల్ని మౌనంగా ఉంచే ప్రయత్నం చేస్తే, మన తిరుగుబాటు స్వరం మరింత పెద్దదవుతుంది. ఎందుకంటే, మనం జార్ఖండ్‌వాసులం. జార్ఖండ్‌వాసులు తలవంచరు” అని ప్రమాణస్వీకారోత్సవానికి ముందు ఎక్స్ వేదికగా ఆయన బీజేపీని విమర్శించారు.