Hindi: మరో భాషా యుద్ధమే : ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్  

తమిళనాడు: “ఫాసిస్ట్ బిజెపి ప్రభుత్వం” తమిళుల మనోభావాలను వినడానికి నిరాకరిస్తే తమిళనాడు మరో “భాషా యుద్ధం” ప్రారంభించడానికి వెనుకాడదని డిఎంకె యువజన విభాగం నాయకుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మంగళవారం అన్నారు. “1938 నాటి హిందీ వ్యతిరేక ఆందోళనలో ఇద్దరు తమిళులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. 1965లో వందలాది మంది యువకులు తమ ప్రాణాలను అర్పించారు. ఇప్పుడు, మనం 2025లో ఉన్నాము. హిందీని మనపై రుద్దితే, తమిళం మరియు మన హక్కులను కాపాడుకోవడానికి వంద మంది కాదు, వేలాది మంది యువత తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు” అని ఉదయనిధి స్టాలిన్ అన్నారు. బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయించడానికి నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ డిఎంకె నేతృత్వంలోని ఇండియా బ్లాక్ పార్టీలు నిరసన తెలిపారు.  ఉదయనిధి మాట్లాడుతూ…  గత 100 సంవత్సరాలలో తమిళనాడులో ప్రధాన నిరసనలు రెండు కారణాల వల్ల జరిగాయని ఉదయనిధి అన్నారు. ఒకటి విద్య కోసం, మరొకటి హిందీ విధించడం కోసమని తెలిపారు. ‘మోదీ వెనక్కి వెళ్లండి’ నిరసనలు ‘మోదీ బయటకు వెళ్లండి’ నిరసనలుగా మారుతాయని ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం తమను బెదిరించడం కొనసాగించకూడదని, ఇది పెరియార్ భూమి, అన్నా భూమి, కలైంజర్ భూమి మరియు మన ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పాలించే ‘ఆత్మగౌరవ భూమి’ అని ఉదయనిధి అన్నారు.

ఈ నిరసనలో పాల్గొన్న వీసీకే అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ మాట్లాడుతూ, హిందీని విధించడం వెనుక బిజెపి ప్రభుత్వం ఉద్దేశం ‘ఒకే దేశం, ఒకే భాష’ అనే విధానాన్ని అమలు చేయడం, హిందీని జాతీయ భాషగా చేయడమేనని అన్నారు. ద్రావిడర్ కజగం అధ్యక్షుడు కె వీరమణి, డిఎంకె కోశాధికారి టిఆర్‌బాలు, టిఎన్‌సిసి అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై, ఎండిఎంకె నేత వైకో, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి షణ్ముగం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆర్ ముత్తరసన్, తమిళగ వజ్వురిమై కట్చి వ్యవస్థాపకుడు టి వెల్మురుగన్, కెఎండికె అధ్యక్షుడు ఇఆర్ ఈశ్వరన్ నిరసనలో పాల్గొన్నారు.

➡️