కెనడా రాయబార కార్యాలయం వద్ద హిందూ-సిక్కు గ్లోబల్‌ ఫోరమ్‌ ఆందోళన

న్యూఢిల్లీ : కెనడాలో ఇటీవల హిందూ ఆలయాలపై దాడులను ఖండిస్తూ న్యూఢిల్లీలో ఆ దేశ రాయబార కార్యాలయం వద్ద హిందూ-సిక్కు గ్లోబల్‌ ఫోరమ్‌ సభ్యులు ఆదివారం ఆందోళనకు దిగారు. పోలీసులు వీరిని అడ్డుకు న్నారు. రాయబార కార్యాలయం వైపునకు మార్చ్‌గా వెళుతున్న ఫోరం సభ్యులను తీన్‌ మూర్తి మార్గ్‌లో పోలీసులు బారికేడ్లతో నిరోధించారు. ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు తర్విందర్‌ సింగ్‌ మార్హా మాట్లాడుతూ హిందూ, సిక్కులే లక్ష్యంగా దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ ఆందోళనలు సందర్భంగా రాయబార కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అదనపు సిబ్బందిని మోహరించారు.

అర్ష్‌ దల్లాను అరెస్టు చేసిన కెనడా పోలీసులు

నిషేధిత ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ (కెటిఎఫ్‌)తో సంబంధం ఉన్న అర్ష్‌ దల్లాను కెనడా పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లో ఒక కాల్పుల ఘటన కేసులో ఇద్దరు వ్యక్తులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరిని ఉగ్రవాది అర్ష్‌దీప్‌ సింగ్‌ గిల్‌ అలియాస్‌ అర్ష్‌ దల్లాగా గుర్తించారు. ఈ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్‌లో హత్యలు, టెర్రర్‌ ఫైనాన్సింగ్‌, దోపిడీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అర్ష్‌ దల్లాను గత ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించింది. డ్రగ్స్‌ అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్‌లోనూ అర్ష్‌దల్లా ప్రమేయం ఉందని కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

➡️