హెచ్‌ఎంపివి కలకలం

  • భయం వద్దు, కొత్త వైరస్‌ కాదు : కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ : భారత్‌లో హ్యుమన్‌ మెటా న్యూమో వైరస్‌ (హెచ్‌ఎంపివి) కేసులు వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఒక్కరోజే దేశంలో మూడు కేసులు నిర్ధారణ అయ్యాయి. కర్ణాటకలోని బెంగళూరులోని బాప్టిస్టు ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. వీరిలో ఒకరు 3 నెలలు, ఇంకొకరు 8 నెలల చిన్నారులు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మరో కేసు నమోదైంది. రాజస్థాన్‌లోని దుంగాపూర్‌కు చెందిన రెండు నెలలు శిశువుకు అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో హెచ్‌ఎంపివి పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగానే ఉంది. అలాగే హెచ్‌ఎంపివి వైరస్‌ సోకిన ముగ్గురు చిన్నారులకు ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన సందర్భాలూ లేవు. దేశంలో హెచ్‌ఎంపివి కేసుల నమోదుపై కేంద్రం స్పందించింది. ఇది కొత్త వైరస్‌ కాదని కేంద్ర ఆర్యోగ మంత్రి జెపి నడ్డా తెలిపారు. ‘హెచ్‌ఎంపివి కొత్త వైరస్‌ కాదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేశారు. దీన్ని మొదటిసారిగా 2001లో గుర్తించారు. అనేక ఏళ్ల నుంచి ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. ఇది అన్ని వయస్సుల వారిపై ప్రభావం కనబరుస్తుంది. శీతాకాలం, వసంత రుతువు ప్రారంభంలో వైరస్‌ ఎక్కువగా వ్యాప్తిస్తుంది’ అని మంత్రి తెలిపారు.

➡️