HMPV – భారత్‌లో ఐదు హెచ్‌ఎంపివి కేసులు నమోదు

న్యూఢిల్లీ : భారత్‌లో ‘హ్యూమన్‌ మెటాన్యుమో వైరస్‌’ కేసులు (హెచ్‌ఎంపివి) ఐదు నమోదయ్యాయి. కర్నాటక, గుజరాత్‌, తమిళనాడుల్లో సోమవారం తొలి కేసులు వెలుగుచూశాయి. అయితే దీనిపై ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దని, ఇది పాత వైరస్సేనని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది. బెంగళూరులోని ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్‌ సోకినట్లు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుర్తించారు. మూడు నెలల ఆడ శిశువును, తొమ్మిది నెలల మగ శిశువును శ్వాసకోశ సంబంధ సమస్యలతో ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో హెచ్‌ఎంపీవీ ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల నివేదికల్లో బయటపడింది. మూడు నెలల చిన్నారి ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి కాగా.. మరో చిన్నారి కోలుకుంటున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దేశంలో తొలి హెచ్‌ఎంపీవీ కేసులు ఇవేనని ‘భారతీయ వైద్య పరిశోధన మండలి'(ఐసీఎంఆర్‌) ప్రకటించింది. చెన్నైలో ఇద్దరు శిశువులకు ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు, దగ్గుతో చేట్‌పేట్‌, గిండిలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరిన వీరినుంచి నమూనాలను సేకరించి పరీక్షించగా ఈ విషయం తేలినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రాజస్థాన్‌కు చెందిన రెండు నెలల శిశువును గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గత నెల 26న చేర్చగా సోమవారం హెచ్‌ఎంపీవీ బయటపడింది. మొదట్లో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగినా ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ శిశువుల తల్లిదండ్రులకు విదేశీ ప్రయాణ నేపథ్యం లేదు. అందువల్ల ఎలా సోకిందనేది తెలియాల్సి ఉంది.

హెచ్‌ఎంపివి కలకలం

➡️