Hoarding collapse Incident : యాడ్‌ ఏజెన్సీపై కేసు

ముంబయి : ముంబయిలో హౌర్డింగ్‌ కూలిన ఘటనలో 14మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘోర ఘటనలో మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైనవారిపై కఠిన చర్యలుంటాయని ముంబయి పోలీస్‌ కమిషనర్‌ వివేక్‌ ఫన్సాల్కర్‌ తెలిపారు. ఇప్పటికే ‘ఇగో మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ యాడ్‌ ఏజెన్సీ యజమాని భవేశ్‌ భిండేపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. కూలిన హోర్డింగ్‌ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంతమంది చిక్కుకొని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. బలమైన ఈదురుగాలుల ధాటికి ఘట్‌కోపర్‌లోని సమతా నగర్‌లో సోమవారం 100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్‌ పక్కనే ఉన్న పెట్రోల్‌ పంపుపై కూలిన విషయం తెలిసిందే. ఈ హోర్డింగ్‌కు అనుమతులు లేవని పోలీసులు గుర్తించడం విశేషం.

మృతులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం : సిఎం ఏక్‌నాథ్‌ షిండే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నగరంలోని అన్ని హోర్డింగ్‌లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా ఏర్పాటు చేసిన వాటితోపాటు ముప్పు పొంచి ఉన్న అన్నింటినీ తొలగించాలని ఆదేశించారు. తాజా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన షిండే.. కారకులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మఅతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

➡️