ఆశారాంతో ప్రాణహాని

Jan 9,2025 00:14 #Asaram Bapu, #bail petition
  • బెయిల్‌ మంజూరుపై బాధిత తండ్రి ఆందోళన

షాజహాన్‌పూర్‌ : బాలికపై అత్యాచారం కేసులో వివాదస్పద అధ్యాత్మిక గురువు ఆశారాంకు మధ్యంతర బెయిల్‌ మంజారు చేసిన నేపథ్యంలో బాధిత కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆశారాం జైలులో ఉన్న సమయంలోనే ఈ కేసుకు సంబంధించిన నలుగురు సాక్షులు హత్యకు గురయ్యారు. మరో ఇద్దరు సాక్షులు కనిపించకుండా పోయారు. అలాగే ఆశారాం జైల్లో ఉన్నప్పుడే జమ్ము, జోధ్‌పూర్‌, ఢిల్లీ, సురసాగర్‌ల్లో తనపై తప్పుడు కేసులు బనాయించినట్లు బాధిత బాలిక తండ్రి తెలిపారు. ఇప్పుడు ఆయన బయటకు వస్తే తమ కుటుంబం బతికిబట్టకట్టే అవకాశం ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. మైనర్లపై నేరాలకు సంబంధించిన కేసుల్లో దోషులకు ఉరిశిక్ష విధించేవిధంగా చట్టాలు ఉన్నాయని చెబుతున్నా..ఆ చట్టాలన్నీ ఆశారాం విషయంలో ఎందుకు అమలు కావడం లేదో అర్థం కావడం లేదన్నారు. న్యాయస్థానాలు ఆశారాం పట్ల మెతక వైఖరిని కొనసాగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే బాధిత బాలిక కుటుంబానికి భద్రత పెంచినట్లు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు బుధవారం వెల్లడించారు.

➡️