చండీగఢ్ : మాజీ రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫోగట్‌కు హర్యానా ప్రభుత్వం గతేడాది ఒలింపిక్స్‌లో పాల్గొన్నందుకు నాలుగు కోట్ల రూపాయల ప్రైజ్‌మనీని ప్రకటించింది. ప్రభుత్వం ఇస్తున్న ఆ డబ్బును తీసుకుంటున్నందుకు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. వీటిపై తాజాగా వినేశ్ స్పందించారు. ‘ట్వీట్‌కు 2 రూపాయలకు ఆశపడిన కొందరు పనిగట్టుకుని మరీ నన్ను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నాపై విషం చిమ్ముతున్న వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. నేను ఎవరి వద్ద పైసా ఆశించను. సాఫ్ట్ డ్రింక్స్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్ వంటి ప్రకటనల్లో నటిస్తే భారీగా డబ్బులు ఇస్తామని యాడ్స్ ఏజెన్సీలు నన్ను సంప్రదించాయి. కానీ నాకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నేను కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నాను. డబ్బులు వస్తున్నాయని చెప్పి.. ప్రజలకు, సమాజానికి హాని చేసే పనులు చేయను. ఇప్పటివరకూ నేను సాధించిన విజయాలు నా కష్టార్జితం. నిజాయితీగా ఉండడంతోపాటు నా ఆత్మీయుల ఆశీర్వాదం వల్లనే ఈస్థాయికి చేరుకున్నాను.’ అని అన్నారు.
