Mamata Banerjee : ఇండియా ఫోరం అధికారంలోకి వస్తే సిఎఎ, ఎన్ఆర్‌సిల రద్దు

సిల్చిరా (అస్సాం)  :   ప్రతిపక్షాల కూటమి ఇండియా ఫోరం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సిఎఎ, ఎన్‌ఆర్‌సిలను రద్దు చేస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. దేశం మొత్తాన్ని బిజెపి ‘నిర్బంధ శిబిరం’ గా మార్చిందని  ధ్వజమెత్తారు.

నలుగురు టిఎంసి అభ్యర్థులకు మద్దతుగా బుధవారం అస్సాంలోని సిల్చార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గన్నారు. ప్రధాని మోడీ తిరిగి అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవని అన్నారు.

మోడీ ప్రభుత్వం దేశం మొత్తాన్ని నిర్బంధ శిబిరంలా మార్చిందని, తన జీవితంలో ఇంత ప్రమాదకరమైన ఎన్నికలను ఎన్నడూ చూడలేదని అన్నారు. తమ పార్టీ అన్ని మతాలను ప్రేమిస్తుందని, ప్రజలను మతప్రాతిపదికన విభజించాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.

ఇండియా ఫోరం విజయం సాధిస్తే.. జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్‌సి), పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), ఏకరూప పౌరస్మృతి (యుసిసి) ఉండవని, అన్ని వివక్షపూరిత చట్టాలను రద్దు చేస్తామని అన్నారు.

అస్సాంలోని నలుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 2026 ఎన్నికలలో తమ పార్టీ మొత్తం 126 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.   ఇది ట్రైలర్‌ మాత్రమేనని.. ఫైనల్‌ కోసం మళ్లీ వస్తానని అన్నారు.

➡️