మోడీ మళ్లీ ప్రధానైతే దేశంలో ఎన్నికలే జరగవు: ఖర్గే

May 15,2024 08:47 #BJP, #coments, #Kharge

మహారాజ్‌గంజ్‌ (యూపీ): ప్రధాని మోడీని ‘ఝూథోన్‌ కా సర్దార్‌’ (అబద్ధాల రాజు) అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అభివర్ణించారు. ఆయన మళ్లీ ప్రధాని అయితే దేశంలో ఇక ఎన్నికలు జరగవని అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వీరేంద్ర చౌదరికి మద్దతుగా ఇక్కడ జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. ప్రధాని మోడీ అనేక హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) జాతీయ ప్రధాన కార్యదర్శి శివపాల్‌ యాదవ్‌తో సహా పలువురు ఇండియా బ్లాక్‌ నాయకుల సమక్షంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ, ”ప్రధాని అబద్ధాలు చెబుతున్నారు. మోడీ అబద్ధాలకోరు, దగాకోరు (‘ఝూథోన్‌ కా సర్దార్‌’).” ”ఈ వ్యక్తి (మోడీ) మళ్లీ (ప్రధానిగా) వస్తే, ఎన్నికలు ఉండవు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు లేదా మహిళా అభ్యర్థులు ఉండరు.” అని స్పష్టం చేశారు. ఎన్నికలను సైద్ధాంతిక పోరుగా పేర్కొన్న ఖర్గే, ”మేం మోడీ లేదా యోగి కావచ్చు ఏ వ్యక్తిపైనా పోరాడటం లేదు, ఇది వ్యక్తిగత పోరాటం కాదు” అని అన్నారు.
70 ఏళ్లలో మేం ఏం చేశామని అడుగుతున్నారు. మేం ఏమీ చేయకపోతే మీరు ప్రజాస్వామ్యానికి ప్రధాని కాలేరు. మేం (కాంగ్రెస్‌) రాజ్యాంగాన్ని రూపొందించి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందున మీరు ప్రధాని అయ్యారు. ”మీరు ఆ ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది జరగదు. దేశంలోని దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, రైతులు , మేధావులు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయనివ్వరు” అని ఆయన అన్నారు. మహారాజ్‌గంజ్‌ ఎంపీగా ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్‌ చౌదరిని ఉద్దేశించి ఖర్గే, ”మీరు ప్రతినిధిగా ఎన్నికై ఏమైనా అభివృద్ధి చేశారా” అని ప్రశ్నించారు. ఈ జిల్లాకు నేపాల్‌తో సరిహద్దు ఉంది. రాజకీయంగా ప్రాధాన్యత ఉంది, ఇప్పటికీ జిల్లా కేంద్రాన్ని రైల్వే లైన్‌తో అనుసంధానం చేయలేదు. మోడీ హయాంలో ఇక్కడ నుంచి అనేక చక్కెర మిల్లులు అదృశ్యమయ్యాయి, ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా కూర్చున్నారు? అని యోగిని నిలదీశారు. ”వారు డబుల్‌ ఇంజిన్ల గురించి మాట్లాడతారు, వాటిలో ఒకటి విఫలమైంది. మరొకటి పట్టాలు తప్పింది” అని అతను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ మాజీ ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ చేసిన పనితో పోలిస్తే ఈ డబుల్‌ ఇంజిన్లు ఏమీ చేయలేవని ఆయన అన్నారు.
ఆనకట్టలు, వంతెనలు, పెద్ద ప్రాజెక్టులను పూర్తిచేసిన కాంగ్రెస్‌ను దుర్వినియోగం చేయడమే వారి (బిజెపి) పని అని ఆయన అన్నారు. బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుపై బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మండిపడ్డారు. ”జపాన్‌ నుంచి రూ.లక్ష కోట్ల రుణం తీసుకున్నారు. అవి ఎక్కడ ఖర్చు చేశారు? బుల్లెట్‌ రైలు ఎక్కడ ఉంది?” అని ఖర్గే అన్నారు. కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం ద్వారా బీజేపీ ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేస్తోందని విమర్శించారు. ”కళంకిత” నాయకులను తమ పార్టీలో చేరమని బలవంతం చేయడానికి ఇడి, సిబిఐని ఉపయోగించుకుంటోందని ఆరోపించారు.

➡️