Odisha : ముగ్గురు ఆర్‌టిఐ కార్యకర్తలపై అక్రమ కేసులు

భువనేశ్వర్‌ :   ముగ్గురు సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కార్యకర్తలపై ఒడిశా పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారు. నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆర్‌టిఐ కార్యకర్తలు ప్రదీప్‌ ప్రధాన్‌, ప్రకాష్‌ దాష్‌, శ్రీకాంత్‌ పాకల్‌లపై ఐపిసి సెక్షన్‌ 419, 420, 465,469, 505 (1)(ఎ)(బి)/34ల కింద కేసులు నమోదు చేశారు.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సన్నిహితుడు, 5టి (ట్రాన్స్‌ఫర్మేషనల్‌ ఇన్షియేటివ్స్‌) చైర్మన్‌ వి.కె. పాండియన్‌ భద్రత కోసం 74 మంది పోలీసు సిబ్బందిని నియమించారని మార్చి 30న భువనేశ్వర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒడిశా సూచనా అధికార్‌ అభిజన్‌ (ఒఎస్‌ఎస్‌ఎ) కన్వీనర్‌ ప్రదీప్‌ ప్రధాన్‌ పేర్కొన్నారు. పాండియన్‌ భద్రత కోసం ఇద్దరు సాయుధ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, 11 మంది హవల్దార్లు, 53 మంది కానిస్టేబుళ్లు, నలుగురు మహిళా కానిస్టేబుళ్లను రక్షణ వాహనంతో సహా పోలీస్‌ శాఖ నియమించిందని తెలిపారు. ఆర్‌టిఐ నుండి ఈ సమాచారాన్ని సేకరించినట్లు వెల్లడించారు. భద్రతా సిబ్బంది నియామకంలో హేతుబద్ధత ఉండాలని, రాష్ట్ర ఖజానాపై అనవసర భారం ఉండకూడదని పేర్కొన్నారు.

ఆర్‌టిఐ ఇటువంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంటూ పోలీస్‌ యంత్రాంగం వారిపై కేసులు నమోదు చేయడం గమనార్హం.

కేసులపై ఆర్‌టిఐ కార్యకర్తలు స్పందిస్తూ.. తమ వాదనలకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. తాము ఆర్‌టిఐకి పంపిన లేఖ ఉందని, ఆర్‌టిఐ సమాచార షీట్‌లో దరఖాస్తుదారునికి ఫార్వార్డ్‌ చేసిన రిఫరెన్స్‌ నెంబర్‌ ఉందని, లేఖ కాపీని తీసుకునేదుకు మా సభ్యులు వ్యక్తిగతంగా హాజరయ్యారని, సంబంధిత అధికారి సమాచారం అందించారని ఎఎస్‌ఎఎ కన్వీనర్‌ ప్రధాన్‌ పేర్కొన్నారు.

➡️