ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే : ఎన్‌జిటికి పర్యావరణమంత్రిత్వశాఖ నివేదిక

Feb 22,2024 12:23 #Illegal sand mining, #ngt
  • సుప్రీంలో నివేదించాలని ఆదేశం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న విషయం నిజమేనని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ మేరకు రూపొందించిన నివేదికను నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి)కు అందచేసింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరుగుతున్నందున నివేదికను అక్కడ కూడా సమర్పించాలని కేంద్ర మంత్రిత్వశాఖను ఎన్‌జిటి ఆదేశించింది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్‌జిటి బుధవారం నిర్వహించిన విచారణ సందర్భంగా బుధవారం ఈ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై ఎన్‌జిటిలో సామాజిక కార్యకర్త దండా నాగేంద్ర పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిమీద విచారణ జరిపిన ఎన్‌జిటి తవ్వకాలను ఆపేయాలని, తవ్వకాలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పర్యావరణ అటవీమంత్రిత్వశాఖను గతంలో ఆదేశించింది. ఈ మేరకు ఏర్పాటైన అటవీ మంత్రిత్వ శాఖ కమిటీ ఇచ్చిన నివేదికలో రాష్ట్ర్రంలో ఇసుక తవ్వకాలకు సంబంధించిన పలు అక్రమాలను వివరించింది. పర్యావరణ అనుమతులు లేకుండా రాష్ట్రంలో ఇంకా భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు నివేదికలో కేంద్ర కమిటీ నిర్ధారించింది. ఫొటోలతో పాటు ఇతర సాక్ష్యాధారాలతో నివేదికను ఎన్‌జిటికి కేంద్ర కమిటీ అందజేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఎలాంటి అనుమతులు లేకుండా 24 గంటలూ తవ్వకాలు చేపడుతున్నారని, ఒక్కో రీచ్‌లో రోజుకు రెండు వేల టన్నుల మేర తవ్వకాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. శాటిలైట్‌ చిత్రాల ద్వారా తవ్వకాల ఆధారాలు సేకరించామని వివరించింది. ఎలాంటి ఇసిలు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని తెలిపింది. గతంలో ఎన్‌జిటి ఇచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదని పేర్కొంది.కేంద్ర కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖకు ఎన్‌జిటి ఆదేశాలు జారీ చేసింది.ఈ అంశంలో కలెక్టర్ల నివేదిక, కేంద్ర మంత్రిత్వశాఖ నివేదిక పూర్తి భిన్నంగా ఉన్నాయని పేర్కొంది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోందని, ఏం చేయాలనేది న్యాయస్థానమే తేలుస్తుందని స్పష్టం చేసింది. తాము కూడా నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి అందజేస్తామని తెలిపింది.

➡️