ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ బిల్లు నిబంధనలు ఏకపక్షం : ప్రతిపక్షాల ఆందోళన

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జాతీయ భద్రత పేరుతో విదేశీయులకు ప్రవేశాన్ని నిరాకరించడంతోపాటు విదేశీయుల బస, ప్రయాణం, తిరిగి రావడం వంటి అన్ని విషయాలపై నియంత్రణను కేంద్ర ప్రభుత్వానికి కల్పించే కొత్త ‘ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ బిల్లు-2025’ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్ట్‌ చట్టం, విదేశీయుల నమోదు చట్టం, విదేశీయుల చట్టం, ఇమ్మిగ్రేషన్‌ చట్టం స్థానంలో కొత్త చట్టం రానుంది. అయితే కేంద్ర హోం మంత్రి నిత్యానందరారు ప్రవేశపెట్టిన ఈ బిల్లులోని నిబంధనలు ఏకపక్షంగా ఉన్నాయని, ఉన్న హక్కులకు భంగం కలిగిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. దేశ భద్రతకు, సమగ్రతకు ముప్పుగా భావించే విదేశీయుల ప్రవేశాన్ని, బసను నిషేధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని కొత్త బిల్లులోని ప్రధాన నిబంధన అని, అయితే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానిని విమర్శించే విదేశీ మేధావులు, జర్నలిస్టులు, ఇతరులకు భారత్‌లో ప్రవేశం నిరాకరించే ధోరణి ఇప్పటికే ఉందని ప్రతిపక్ష పార్టీల నాయుకులు పేర్కొన్నారు. భారతీయ-అమెరికన్‌ రాజకీయవేత్త కతిమసావంత్‌, బ్రిటిష్‌-భారత రచయిత నితాషా కౌల్‌లకు ప్రవేశం నిరాకరించడాన్ని ప్రతిపక్ష నాయకులు గుర్తు చేశారు. అధికారంలో ఉన్నవారు చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు.
కాగా, ఈ నూతన బిల్లు ప్రకారం, అత్యవసర పరిస్థితుల్లో వారెంట్‌ లేకుండా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు విదేశీయులను అరెస్టు చేయవచ్చు. విదేశీయుల ప్రయాణాన్ని పరిమితం చేయడానికి, రక్షిత ప్రాంతాలలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి సంబంధిత అధికారులకు అధికారం ఉంటుంది. దర్యాప్తులో భాగంగా లేదా దర్యాప్తు సంస్థల అవసరాలకు అనుగుణంగా విదేశీయుల తిరుగు ప్రయాణాన్ని కూడా నిలిపివేయవచ్చు. విదేశీ పౌరులను అనుమతించే విద్యా, ఆరోగ్య సంస్థలు, ప్రైవేట్‌ నివాసాల యజమానులు వివరాలను అధికారులకు నివేదించాలనే నిబంధన కూడా ఉంది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు విధించేలా కూడా బిల్లులో నిబంధనలు ఉన్నాయి. ఆమోదించబడిన వీసా లేదా పాస్‌పోర్ట్‌ లేని వారికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. నకిలీ పత్రాలు సమర్పించిన వారికి రెండు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష, వీసా గడువు ముగిసిన తర్వాత దేశంలో ఉండే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అధికారిక గణాంకాల ప్రకారం, 2023 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 మధ్య 9,840,321 మంది విదేశీయులు దేశాన్ని సందర్శించారు.

➡️