ఉత్తరాఖండ్‌లో యుసిసి అమలు

Feb 5,2025 23:55 #implementation, #in Uttarakhand, #UCC
  • 10 రోజుల్లో ఒక సహజీవనం నమోదు

డెహ్రాడూన్‌ : ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి)ని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మొదటి 10 రోజుల్లో కేవలం ఒకే ఒక లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌ (సహజీవనం) నమోదయింది. సహజీవనం చేస్తున్న జంటలకు నమోదు తప్పనిసరి అనే నిబంధన కారణంగా మొత్తంగా ఐదు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒక జంటకు రిజిస్ట్రేషన్‌ మంజారు చేశామని, మరో నాలుగు జంటలకు ధ్రువీకరణ జరుగుతోందని అధికారులు తెలిపారు. జనవరి 27న ఉత్తరాఖండ్‌లోని బిజెపి ప్రభుత్వం యుసిసిని అమల్లోకి తీసుకురావడంతో దేశంలో యుసిసిని అమల్లోకి తీసుకొచ్చిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలిచింది. కాగా, సహజీవనం చేస్తున్న జంటలకు నమోదు తప్పనిసరి అనే నిబంధన ఉన్నా.. తక్కువ దరఖాస్తులు రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు తమ వ్యక్తిగత సంబంధాల వివరాలను అధికారిక వేదికపై వెల్లడించడానికి సిద్ధంగా లేకపోవడమూ.. లేదా.. నమోదు చేసుకోని జంటలకు కఠినమైన శిక్షలు గురించి పూర్తిగా తెలియకపోవడమో కావచ్చు. అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. నిబంధనల ప్రకారం, సహజీవనం చేస్తున్న జంట తమ సంబంధం గురించి ఒక నెలలోపు సంబంధిత అధికారులకు నివేదిక సమర్పించకపోతే, వారికి జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ద్వారా మూడు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. 10,000 వరకూ జరిమానా లేదా ఈ రెండూ విధిస్తారు. తప్పనిసరిగా సహజీవనాన్ని నమోదు చేసుకోవాలనే యుసిసి నిబంధన ప్రజల గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని, ఇది ప్రజల ‘బెడ్‌రూమ్‌లలోకి తొంగి చూసే” చర్యగా మరి కొంతమంది విమర్శిస్తున్నారు.

➡️