కొల్‌కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్‌కతా ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగతున్న సమయంలోనే ఈ రాష్ట్రంలోనే ఒక నర్సు నైట్‌షిఫ్టులో వేధింపులను ఎదుర్కోవడం కలకలం రేపుతోంది. భిర్భుమ్ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. చోటోచక్ గ్రామానికి చెందిన అబ్బాస్ ఉద్దిన్‌కు జ్వరం రావడంతో అతడి కుటుంబసభ్యులు శనివారం రాత్రి 8.30 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు సెలైన్ ఎక్కించడం కోసం వార్డుకు తరలించారు. అక్కడ విధుల్లో ఉన్న ఓ మహిళా నర్సు అతడికి సెలైన్ బాటిల్ ఎక్కిస్తుండగా ఆ రోగి అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. తనను అభ్యంతరకంగా తాకడంతో పాటు అసభ్య పదజాలంతో మాట్లాడినట్లు ఫిర్యాదులో తెలిపారు. రోగి చేష్టలతో తాను భయభ్రాంతులకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు హెచ్చరించినా అతడు వినిపించుకోలేదు. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సిటీ స్కాన్‌కు వెళ్తే బాలికపై..
రాష్ట్రంలోని హవ్‌డాలో మరో ఘటన వెలుగుచూసింది. ఓ 14 ఏళ్ల బాలికపై ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ వేధింపులకు పాల్పడ్డాడు. నిమోనియాతో బాధపడుతున్న ఆమె హవ్‌డా సర్దార్ ఆసుపత్రిలో సీటీ స్కాన్ కోసం వెళ్లగా.. ల్యాబ్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆమెతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. భయంతో బాలిక కేకలు వేయడంతో గమనించిన కుటుంబసభ్యులు ఆమెను రక్షించారు. ఈ ఘటనతో బాధితురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. నిందితుడిపై దాడికి యత్నించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు.