మహారాష్ట్ర ఎంపిల ఎన్నికలో కాంగ్రెస్‌ ఇరకాటంలో పడనుందా ..!

ముంబయి :    మహారాష్ట్ర రాజ్యసభ సభ్యుల ఎన్నికలో కాంగ్రెస్‌ ఇరకాటంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇద్దరు సీనియర్‌ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పిన కొద్ది రోజుల వ్యవధిలోనే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌ సోమవారం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన మంగళవారం  బిజెపి గూటికి చేరారు.    బుధవారం చవాన్ రాజ్యసభకు నామినేషన్ సమర్పించనున్నట్లు సమాచారం.  మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు  కాంగ్రెస్‌లో  ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.

మహారాష్ట్రలోని 19 రాజ్యసభ స్థానాల్లో ఆరు స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ కానున్నాయి.  వీటిలో కాంగ్రెస్‌ నుండి కుమార్‌ కేట్కర్‌ ఒక్కరు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాటిలో బిజెపికి మూడు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి), శివసేన (ఉద్ధవ్‌ థాకరే వర్గం)లకు ఒక్కో స్థానం చొప్పున ఉన్నాయి.

ఒక పార్టీ నుండి తమ అభ్యర్థి రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 41 మంది ఎమ్మెల్యేలు  మద్దతు ప్రకటించాల్సి వుంది. అయితే కాంగ్రెస్‌కు 41 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేనందున కుమార్‌ కేట్కర్‌ స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. చవాన్‌ రాజీనామాకు ముందు కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే చవాన్‌ రాజీనామాతో పాటు అవినీతి కేసులో డిసెంబర్‌లో మాజీ మంత్రి సునీల్‌ కేడర్‌పై అనర్హత వేటు పడటంతో ఆ సంఖ్య 42కి పడిపోయింది. అయితే ఈ 42 మందిలో ముంబయి బాంద్రా (తూర్పు) నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే జిషన్‌ సిద్ధిక్‌ ..  త్వరలో  అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎన్‌సిపిలో చేరనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.   దీంతో ఈ సంఖ్య 41కి పడిపోయే అవకాశం ఉంది.  మరోవైపు కనీసం ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు అశోక్‌ చవాన్‌ బిజెపిలోకి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో మహారాష్ట్రలో కాంగ్రెస్‌ భవితవ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.   ప్రస్తుతానికి ఎగువ సభలోని 245 స్థానాల్లో కాంగ్రెస్‌కు 30 మాత్రమే ఉండగా.. వాటిలో 12 నామినేట్‌ స్థానాలు కావడం గమనార్హం.

➡️