ముజఫర్‌పూర్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీపై బీహార్‌లోని కోర్టులో ఫిర్యాదు దాఖలయింది. దేశ అత్యున్నత రాజ్యాంగ అధినేతను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ముజఫర్‌పూర్ జిల్లా కోర్టులో సుధీర్ ఓజా అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ఎంపి ప్రియాంక గాంధీని సహా నిందితులుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓజా విలేకరులుతో మాట్లాడుతూ ‘బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తూ చివరికొచ్చేసరికే రాష్ట్రపతి అలసిపోయారు. ఆమె చాలా కష్టపడి మాట్లాడారు. పూర్ థింగ్’ అని సోనియాగాంధీ వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. అలాగే రాష్ట్రపతి ప్రసంగాన్ని ‘బోరింగ్’ అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించినట్లు ఓజా తెలిపారు. ప్రియాంక గాంధీ కూడా ఆ సమయంలో పక్కనే ఉన్నారన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలపై రాష్ట్రపతిభవన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. సోనియాగాంధీ పేరు ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు ‘అమోదయోగ్యం కాదు’ అని పేర్కొంది. ముర్ము అలసిపోలేదని తెలిపింది.
