పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌… తగ్గిన విమాన ఇంధనం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కోట్లాది మంది ప్రజలపై ప్రభావం పడే వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లపై ధర పెంచిన కేంద్రం, విమానయాన ఇంధనం ధర మాత్రం 6.3 శాతం తగ్గించింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్‌పిజి సిలిండర్‌పై ఏకంగా రూ.48.50 మేర పెంచినట్లు, వెంటనే అమలులోకి వచ్చినట్లు దేశీయ చమురు సంస్థలు మంగళవారం ప్రకటించాయి. ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,691 నుంచి రూ.1,740కి పెరిగింది. విజయవాడలో సిలిండర్‌ ధర రూ.1853 నుంచి రూ.1901కి పెరిగింది. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. అంతకుముందు సెప్టెంబర్‌ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను కంపెనీలు పెంచాయి. విమాన ఇంధనం ఏవియేషన్‌ టర్బన్‌ ఫ్యూయల్‌ (ఎటిఎఫ్‌) ధర లీటరుకు రూ.5.83 లేదా 6.29 శాతం తగ్గాయి. లీటరు ధర దేశ రాజధానిలో రూ.87.59కి చేరింది.

➡️