ఐరాసలో కాల్పుల విరమణకు అనుకూలంగా భారత్‌ ఓటు

 న్యూఢిల్లీ :    ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశం (యుఎన్‌జిఎ)లో ప్రవేశపెట్టిన ముసాయితా తీర్మానానికి అనుకూలంగా భారత్‌ మంగళవారం ఓటు వేసింది. ఇజ్రాయిల్‌ తక్షణ కాల్పుల విరమణతో పాటు, అంతర్జాతీయ చట్టాల ప్రకారం సాధారణ పౌరుల రక్షణ , బందీలను విడుదల చేయాలని పిలుపునిచ్చింది. 193 సభ్యదేశాల్లో 153 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, అమెరికా, ఇజ్రాయిల్‌ సహా 10 దేశాలు వ్యతిరేకించాయి. ఐరోపాకు చెందిన 23 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో యుఎన్‌జిఎ 4/5 వంతు మెజారిటీతో తీర్మానానికి ఆమోదం లభించింది.

ఈ తీర్మానంపై ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మాట్లాడారు. ఇటువంటి క్లిష్ట సమయంలో సరైన సమతుల్యతను సాధించడమే అసలైన సవాలని అన్నారు. హమాస్‌ దాడులకు ప్రతీకారంగా గత రెండు నెలలుగా ఇజ్రాయిల్‌ చేపడుతున్న దాడి కారణంగా 18,000 మందికి పైగా మరణించిన పశ్చిమాసియాలో పరిస్థితిని పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ప్రాతిపదికను కనుగొనగలిగిందనే వాస్తవాన్ని భారత్‌ స్వాగతిస్తోందని చెప్పారు. అయితే యుఎన్‌జిఎ అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ఓటు వేసేందుకు భారత్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

➡️