శ్రీనగర్: ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ వేదిక శాశ్వతమని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు. ఈ వేదిక కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కాదని తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయడం, ద్వేషాన్ని తొలగించడం కోసమని చెప్పారు. ‘ఇండియా’ బ్లాక్‌లో భాగమైన ఆప్, కాంగ్రెస్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం తలపడుతున్నాయి. ఈ కూటమికి చెందిన టీఎంసీ, శివసేన (యూబీటీ) వంటి పార్టీలు ఆప్‌కు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ‘ఇండియా’ వేదిక ఐక్యత, మనుగడపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే అయితే ఈ వేదికను ముగించవచ్చని ఫరూక్ అబ్దుల్లా కుమారుడు, జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సూచించారు.కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో ‘ఇండియా’ వేదిక భవిష్యత్తు గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఫరూక్ అబ్దుల్లా సమాధానమిచ్చారు. ఈ వేదిక కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కాదని తెలిపారు. దేశాన్ని బలోపేతం చేయడం, ద్వేషాన్ని తొలగించడం కోసమని చెప్పారు. ‘ఈ వేదిక శాశ్వతం. ఇది ప్రతి రోజు, ప్రతి క్షణానికి సంబంధించినది’ అని అన్నారు. అయితే ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం కేంద్రంతో పోరాటం చేయదని తెలిపారు. రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/abdullah.jpg)