- ఏచూరికి జాతీయ నేతల ఘననివాళి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కమ్యూనిస్టు యోధుడు, పరోపకారి, అందరూ ఆమోదించిన నేత సీతారాం ఏచూరికి పలువురు జాతీయ నాయకులు శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని తాల్కటోర ఇండోర్ స్టేడియంలో సిపిఎం కేంద్ర కమిటీ ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో పాల్గొన్న వీరు దేశంలో ప్రగతిశీల, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యతకు సీతారాం ఏచూరి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. జనం పెద్దయెత్తున హాజరైన ఈ సభలో వివిధ పార్టీల నేతలు మాట్లాడుతూ దేశాన్ని కబళించేందుకు యత్నిస్తున్న మతతత్వ శక్తులకు గట్టి ఎదురుదెబ్బ తగలడానికి కారణమైన ఇండియా బ్లాక్ రూపశిల్పి ఏచూరి అని కొనియాడారు. సంక్షోభ సమయాల్లో సీతారాం ఏచూరి తమకు మనోధైర్యాన్నిచ్చిన తీరును వారు గుర్తు చేసుకున్నారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ సీతారాం ఏచూరి సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. మార్క్సిజం పట్ల ఆయనకున్న నిబద్ధతను, విద్యార్థి దశ నుండి దేశంలో వామపక్ష ఉద్యమానికి బహుముఖంగా చేసిన సేవలను ఆమె గుర్తు చేసుకున్నారు. దేశం కీలకమైన మలుపులో ఉన్న ఈ సమయంలో సీతారాం లేకపోవడం చాలా పెద్ద లోటు అన్నారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, డి.రాజా (సిపిఐ), ఫరూక్ అబ్దుల్లా (ఎన్‌సి), కనిమొళి (డిఎంకె), మనోజ్ ఝా (ఆర్‌జెడి), రాంగోపాల్ యాదవ్ (ఎస్‌పి), సుప్రియా సూలే (ఎన్‌సిపి), గోపాల్ రారు (ఆప్), దీపాంకర్ భట్టాచార్య (సిపిఐఎంఎల్), మహువా మాఝీ (జెఎంఎం), మనోజ్ భట్టాచార్య (ఆర్‌ఎస్‌పి), జి దేవరాజన్ (ఫార్వర్డ్ బ్లాక్), ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్, సీనియర్ పాత్రికేయులు ఎన్ రామ్, సామాజిక వేత్త తీస్తా సెతల్వాద్ మాట్లాడారు. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్, బివి రాఘవులు, సూర్యకాంత్ మిశ్రా, సుభాషిణి అలీ, ఎమ్‌డి సలీం, ఎంఎ బేబి, తపన్ సేన్, జి.రామకృష్ణ, ఎ. విజయరాఘవన్, నిలోత్పల్ బసు, అశోక్ దావలే, రామచంద్రడోమ్, గోవిందన్ మాస్టర్, పశ్చిమ బెంగాల్ లెఫ్ట్‌ఫ్రంట్ చైర్మన్ బిమన్ బసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ఏచూరి జీవిత ప్రస్థానాన్ని కళ్లకు కట్టింది. చిన్ననాటి ఫొటోలు, స్కూల్, కాలేజీ, స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో పాల్గొన్న ఫొటోలు ఆయన జీవిత గమనాన్ని చాటిచెప్పాయి. జననాట్య మంచ్, ప్రచమ్ కళాకారులు విప్లవగీతాలు ఆలపించారు.
‘మెరుగైన భారత్… సామ్యవాద భారత్’ ఏచూరి ఆలోచన : ప్రకాశ్ కరత్
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్ మాట్లాడుతూ సీతారాం ఏచూరితో తనకున్న అనుబంధం 50 ఏళ్ల నాటిదని గుర్తు చేసుకున్నారు. వామపక్ష ఉద్యమానికి ఆయన చేసిన కృషిని, ముఖ్యంగా హిందుత్వ రాజకీయాలపై ఆయన చేసిన పోరాటాన్ని వివరించారు. మెరుగైన భారతదేశం.. సామ్యవాద భారతదేశం ఏచూరి ఆలోచన అని, ఈ ఆలోచనను నెరవేర్చడానికి మనమందరం కలిసి పని చేయాలని, అదే ఏచూరికి ఇచ్చిన నిజమైన, ఘనమైన నివాళి అవుతుందని అన్నారు. లౌకిక, ప్రజాతంత్ర శక్తులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు.
ఇండియా బ్లాక్ చీఫ్ అర్చిటెక్టర్: రాహుల్
ఇండియా బ్లాక్ చీఫ్ ఆర్కిటెక్ట్ ఏచూరి అని, ఆయన వివిధ పార్టీల మధ్య వారధి అని ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. ”సీతారాం ఏచూరి నా స్నేహితుడు. ఆయన స్నేహితునిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. పరిచయమైన
మొదటి రోజు నుండి ఆయన్ని చాలా దగ్గరగా చూశాను. ఇతరుల మాటలు విని వారి మాటలకు విలువనిచ్చే వ్యక్తి. ఆయన తన సొంత భావజాలంలో స్థిరంగా ఉన్నప్పటికీ, ఎదురుగా ఉన్నవారి ఆలోచనలు, వైఖరులు, భావాలను అర్థం చేసుకున్నారు. మేము ఏచూరితో మాట్లాడినప్పుడు, ఆయన ఎక్కడ నుండి వస్తున్నాడో, మేము ఎక్కడ నుండి వస్తున్నామో మాకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. రాజకీయ నాయకుల్లో ఉండే దర్పం, అహంకారం, ఆగ్రహం వంటివి మచ్చుకు కూడా కానరాని మహా నేత ఏచూరి అని అన్నారు. కనిపించలేదు. ఒక వ్యక్తి ఉత్తమ లక్షణాలను రాజకీయాలు అరువు తెచ్చుకుంటాయనడానికి ఆయన ఒక ఉదాహరణ” అని అన్నారు. ”ఇండియా బ్లాక్‌కు ప్రధాన రూపశిల్పిగా ఉన్న ఏచూరి వివిధ పార్టీల మధ్య వారధిగా నిలిచారని అన్నారు. మా తల్లి (సోనియా) కూడా ఏచూరికి గొప్ప స్నేహితురాలు. నిజానికి మా అమ్మ నాకంటే ఆయనతో ఎక్కువ స్నేహం చేసేది. కొద్దిరోజుల క్రితం అమ్మను చూసేందుకు ఏచూరి వచ్చారు. రాజకీయాల గురించి చర్చిస్తున్నప్పుడు, ఆయన విపరీతంగా దగ్గడం గమనించాను. అప్పుడు నేను, ‘ఏచూరీజీ మీరు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి’ అన్నాను. ఆయన నవ్వి ఊరుకున్నారు. మా అమ్మలాగే ఆయన కూడా ఆసుపత్రికి వెళ్లడానికి ఇష్టపడలేదు. ఆయన తిరిగి వెళ్లిపోతున్నప్పుడు కూడా నేను మళ్లీ మెసేజ్ చేశాను.. ‘కారు నేరుగా ఆసుపత్రికి వెళ్లనివ్వండి’. ఆయన ఇంకా సంకోచించాడు. తరువాత ఆసుపత్రికి వెళ్లేందుకు అంగీకరించారు. నా స్నేహితుడు త్వరలో ఆసుపత్రి నుండి వస్తాడని ఆశించాను. నా ఆశ ఫలించలేదు. కొడుకు చనిపోయిన సందర్భంగా ఫోన్ చేశాను. ఆయన ఫోన్ ఎత్తేసరికి నేనేం మాట్లాడలేకపోయాను. తరువాత, ఏచూరి నిష్క్రమణ తరువాత నేను ఆయన కుటుంబానికి సంతాప సందేశం రాయడానికి ప్రయత్నించినప్పుడు. నేను మాటల కోసం వెతికాను. డ్రాఫ్ట్‌లు మార్చాను. తిరిగి రాశాను. అలా చివరకు ఒక సందేశం ఎలాగో రాశాను. ఏచూరీజీ మనం ఎప్పుడూ విశ్వసించగలిగే వ్యక్తి. ఎలాంటి ఒత్తిడికి లొంగలేదు. ఆయన చేసినదంతా భారతదేశ మేలు కోసమే” అని అన్నారు.
యువతకు, విద్యార్థులకు ఏచూరి గొప్ప స్ఫూర్తిదాయకం : పినరయి విజయన్
సీతారాం ఏచూరి ”భారతీయ చరిత్ర, సమాజం, సంస్కృతి, రాజకీయాలపై మంచి అవగాహన ఉన్న మార్క్సిస్ట్ సిద్ధాంతకర్త” అని కేరళ ముఖ్యమంత్రి, సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు పినరయి విజయన్ పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి అత్యంత అవసరమైన తరుణంలో ఏచూరిని మనం కోల్పోయామని అన్నారు. సెక్యులరిజంపై మతోన్మాదం పెద్దఎత్తున దాడులు చేస్తున్న తరుణంలో ఏచూరి నిష్క్రమణ ఒక దెబ్బ అని, సిపిఎం ప్రధాన కార్యదర్శిగా కష్టకాలంలో పార్టీని నడిపించారని అన్నారు. దేశ చరిత్ర, సంస్కృతి, సామాజిక వాస్తవాలు, ప్రస్తుత సంఘటనల గురించి ఆయనకు లోతైన అవగాహన ఉందన్నారు. అదే సమయంలో, అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా పరిశీలించి విశ్లేషించేవారని అన్నారు. మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, చారిత్రక భౌతికవాదాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చాలా సరళమైన భాషలో అందించగలిగారని అన్నారు. ఆయన నేతృత్వంలో పార్టీ తరగతులు గొప్ప ప్రభావాన్ని చూపాయన్నారు. దేశంలోని యువతకు, విద్యార్థులకు ఏచూరి ఎప్పుడూ గొప్ప స్ఫూర్తిదాయకంగా ఉండేవారని అన్నారు. ఏచూరి మరణానంతరం జెఎన్‌యు ఇచ్చిన ఉద్వేగభరితమైన సందేశం దేశంలోని విద్యార్థులకు ఆయనపై ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమని అన్నారు. పార్లమెంటులో ఏచూరి కార్యకలాపాలన్నీ ప్రజల సంక్షేమానికి సంబంధించినవేనని, ఆయన ‘పీపుల్స్ పార్లమెంటేరియన్’ అనే బిరుదుకు అర్హుడని అన్నారు. ఆర్టికల్ 370, సిఎఎ, ఎలక్టోరల్ బాండ్ వంటి సమస్యలపై నికరంగా పోరాడారని అన్నారు. గత ఎనిమిదేళ్లుగా ఎల్‌డిఎఫ్ ప్రభుత్వానికి ఆయన మార్గదర్శకాలు ఎంతగానో తోడ్పడ్డాయని, కేరళ ఆర్థిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కబళించడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించినప్పుడు వివిధ జాతీయ పార్టీల నేతలను అందులో భాగస్వామ్యం చేయడంలో ఆయన కృషి వుందని అన్నారు. ఏచూరి మరణం అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని అన్నారు.
ఏచూరి అందరి సొత్తు : మల్లికార్జున్‌ఖర్గే
సీతారాం ఏచూరి కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే ఆస్తి కాదని, అందరి అభిమాన నాయకుడని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తమ అందరితో సమావేశాలు పెట్టేవారని, ఆయన ఇండియన్ బ్లాక్ ప్రధాన రూపశిల్పి అని, ఇండియా బ్లాక్‌లో ఐక్యతను తీసుకురావడానికి, దానిని ముందుకు తీసుకెళ్లడానికి ఏచూరి కృషి చేశారని గుర్తు చేశారు. అందరూ అంగీకరించే విధానాన్ని రూపొందించారని అన్నారు. ఏచూరి తన జీవితాంతం ప్రజల కోసమే ఉన్నారని, మొదటి యుపిఎ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ చట్టంపై ఆయన ఎంతో ఆసక్తి కనబరిచారని తెలిపారు. పేదల అభ్యున్నతికి ఉపాధి హామీయే గొప్ప చట్టం అని గట్టిగా వాదించారన్నారు. ఏచూరిని కోపంగా చూడలేదని, అసహనం ఆయన పదజాలంలో లేదని అన్నారు. చర్చలు జరిగితే, ‘జరిగిందేదో జరిగింది. ఇప్పుడు మనం ఏమి చేయగలమో చూద్దామని అనేవారని’ తెలిపారు. అలాంటి వ్యక్తి మధ్యవర్తిత్వం వహించకపోతే మా పోరాటాలు కొనసాగేవి కావని అన్నారు. దేశ ప్రజల ఉమ్మడి శ్రేయస్సు కోసం మనమందరం కలిసివచ్చే వేదికను మనం సృష్టించగలమని ఆయన ఎల్లప్పుడూ గుర్తుచేస్తారని అన్నారు. ఖర్గేజీ కూడా మా సహచరుడు, ఆయనే మాతో పాటు నిలబడతారని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.
ప్రపంచంలోని ఏ అగ్రశ్రేణి సంస్థకైనా చేరుకోగలిగే విద్యార్థి ఏచూరి : ప్రభాత్ పట్నాయక్
ప్రఖ్యాత ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ మాట్లాడుతూ సీతారాం ఏచూరిని కేవలం సహచరుడు,స్నేహితుడిగా మాత్రమే కాకుండా, ”తెలివైన” విద్యార్థిగా కూడా గుర్తు చేసుకున్నారు. సీతారాం తన అత్యుత్తమ విద్యార్థి అని, స్కాలర్‌షిప్‌తో ప్రపంచంలోని ఏ ప్రముఖ విద్యాసంస్థలోనైనా చదువుకోవచ్చునని, జెఎన్‌యులో కొనసాగాలనే ఆయన నిర్ణయం సంస్థను తీర్చిదిద్దడంలో పాత్ర పోషించిందని ఆయన అన్నారు. 1973లో జెఎన్‌యులో ఎంఎ కోర్సు చదివేందుకు వచ్చిన సీతారాం, పరిశోధనలో తలమునకలై పార్టీలో చేరారని అన్నారు. కమ్యూనిస్టు విప్లవానికి కావాల్సిన విధానాలు, వ్యూహాలను కచ్చితంగా తెలుసుకుని వాటిని ఆచరణలో పెట్టాలనే ఆలోచన సీతారామ్‌కు ఉందని అన్నారు. ఆయనను ”ఆధునిక కమ్యూనిస్ట్” అని పట్నాయక్ అన్నారు.
మహోన్నతమైన కమ్యూనిస్టు నాయకుల్లో ఒకరు : డి.రాజా
సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ దేశ సమకాలీన చరిత్రలో మహోన్నతమైన కమ్యూనిస్టు నాయకుల్లో సీతారాం ఏచూరి ఒకరని అన్నారు. సీతారాం మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, యావత్ దేశానికి తీరని లోటని, ఆయన వారసత్వం ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. సమానత్వంతో కూడిన సోషలిస్టు భారతదేశం వైపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, నవ భారత నిర్మాణానికి వామపక్షాలు ఈ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.