న్యూఢిల్లీ : సైబర్ మోసం కారణంగాఈ ఏడాది జనవరి నుండి సెప్టెంబర్ వరకు భారత్ రూ.11,333 కోట్లు నష్టపోయింది. హోం వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ విభాగమైన భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి) నివేదిక తెలిపింది.
ఈ నష్టంలో అత్యధిక భాగం స్టాక్ మార్కెట్ కుంభకోణాలదే కావడం గమనార్హం. 2,28,094 ఫిర్యాదులతో రూ.4,636 కోట్లు నష్టపోయినట్లు తెలిపింది. 1,00,360 కేసులతో రూ.3,216 కోట్లు పెట్టుబడుల సంబంధిత కుంభకోణాల్లో నమోదయ్యాయి. 63,481 ఫిర్యాదులతో రూ.1,616 కోట్లు ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలతో నమోదైనట్లు నివేదిక తెలిపింది.
సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సిఎఫ్‌సిఎఫ్‌ఆర్‌ఎంఎస్) సమాచారాన్ని జాతీయ మీడియా సంపాదించింది. ఈ నివేదిక ప్రకారం 2024లో సుమారు 12 లక్షలకు పైగా సైబర్ మోసం ఫిర్యాదులు అందినట్లు వెల్లడైంది. వీటిలో 45 శాతం కంబోడియా, మయన్మార్, లావోస్ సహా ఆగేయాసియా దేశాల నుండి వచ్చినట్లు తెలిపింది.
2021లో ప్రారంభమైనప్పటి నుండి, సిఎఫ్‌సిఎఫ్‌ఆర్‌ఎంఎస్ 30.05 లక్షల ఫిర్యాదులను నమోదు చేసింది. మొత్తం నష్టాలు రూ.27,914 కోట్లకు చేరుకున్నాయి. 2021లో 1,35,242 ఫిర్యాదులు, 2022లో 5,14,741, 2023లో 11,31,221తో ఏడాదికి పెరుగుతూ వస్తున్నాయి.