- ‘ద హిందూ’ ఇంటర్వ్యూలో ప్రకాశ్ కరత్
కొల్లాం : గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిపై పోరాటం జరపాలన్న ప్రత్యేక ప్రయోజనం కోసమే 26 బిజెపియేతర పార్టీలతో కలిసి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్, ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) రూపొందిందని సిపిఎం పొలిట్‌బ్యూరో సమన్వయకర్త ప్రకాశ్ కరత్ చెప్పారు. 2024 తర్వాత అది ఎలా వుండాలనే అంశంపై ఎవరికీ ఎలాంటి ఆలోచనలు లేవని అన్నారు. కొల్లాంలో ఆదివారం కేరళ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని హిందూకు ప్రకాష్ కరత్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘మా పార్టీ సిపిఎం ఇటువంటి తరహాలో సంస్థాగత నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే విభిన్నమైన విధానాలు, సిద్ధాంతాలు, వ్యక్తిత్వాలు కలిగిన 26 పార్టీలు కలిసి కేంద్ర స్థాయిలో అటువంటి ఏకీకరణ నిర్మాణాన్ని కలిగి వుండలేవు’ అని కరత్ చెప్పారు. ‘సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీలు ప్రయత్నించాయి. కానీ అది సరిగా పనిచేయదని మేం చెప్పాం. కేవలం నేతలందరూ సమావేశమవుతున్నారు అంతే. కొన్ని కమిటీలను ఏర్పాటు చేశాం. కానీ వాటిల్లో ఏదీ పనిచేయడం లేదు. అఖిల భారత స్థాయిలో చర్చలు జరపడం సాధ్యం కాదు కాబట్టే ఎన్నికల అవగాహన లేదా సీట్ల సద్దుబాటు అనేది రాష్ట్రాలవారీగా వుండాలని మేం చెప్పాం. ఉదాహరణకు, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం కలిసి పనిచేయలేవు. అలాగే కేరళలో సిపిఎం, కాంగ్రెస్‌లు కలిసి పనిచేయలేవు. కాబట్టి, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాష్ట్రాల స్థాయిలో ఎన్నికల అవగాహన వుండాలని భావించాం. దానివల్ల మంచి ఫలితాలే వచ్చాయి. బిజెపి మెజారిటీని కోల్పోయింది. 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందువల్ల ఇండియా బ్లాక్ దార్శనికత లేదా దృక్పథం అనేది కేవలం లోక్‌సభ ఎన్నికల వరకు మాత్రమే’ అని కరత్ విశ్లేషించారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఇండియా బ్లాక్ వెనుకపట్టు పట్టింది. ఎందుకంటే గ్రూపులోని పార్టీల మధ్య కలహాలే ప్రధాన కారణం. తమిళనాడు, బీహార్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇండియా బ్లాక్ కంటే ముందుగానే ఈ పార్టీల మధ్య పొత్తు వుందని కరత్ చెప్పారు. ‘లోక్‌సభ ఎన్నికల తర్వాత, తమకు ఒక వేదిక అవసరమా అని ఈ పార్టీలు ఆలోచించాల్సి వుంది. ఒకవేళ వుంటే దాన్ని ఎలా రూపొం దించుకోవాలి అని కూడా ఆలోచించాలి. కేవలం ఎన్నికలను దృష్టిలో వుంచుకునే చేశారా? అదే గనుక అయితే ఇప్పుడు చేయాల్సిన అవసరమేమీ లేదు’ అని కరత్ చెప్పారు.
కేరళలో బిజెపి పనితీరు
దాదాపు దశాబ్ద కాలంగా సిపిఎం నేతృత్వంలోని సంకీర్ణం అధికారంలో వున్న కేరళలో పార్టీ ముందున్న సవా లు రాజకీయమే గానీ సంస్థాగతం కాదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూసినట్లైతే, కేరళలో కొన్ని భాగాల్లో, కొన్ని తరగతుల్లో బిజెపి విస్తరించిందని చెప్పారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మా సమీక్షలో, ఈ అంశం చాలా స్పష్టంగా బయటపడింది. అంతర్జాతీయంగా సాధారణంగా మితవాదుల వైపు మళ్ళింపు వుంది. కేరళ సమాజంలోనూ అలాగే వుంది. దాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారన్నదే ప్రశ్న? ఈ రాష్ట్ర మహాసభలో తీవ్రంగా చర్చిస్తున్న పలు అంశాల్లో ఇది కూడా ఒకటి’ అని కరత్ చెప్పారు. ఇటీవల మతతత్వం బాగా పెరిగిందని, మత తత్వ శక్తులు కూడా దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయని కరత్ చెప్పారు. ‘ఇది హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను, ఇతరులను ప్రభావితం చేస్తోంది. భారతదేశానికి ఇది మంచిది కాదు, దీన్ని సాంస్కృతికంగా, సామాజికంగా పరిష్కరించడానికి కొన్ని మార్గాలను మేం రూపొందించాం’ అని చెప్పారు.