వంద కోట్ల ఓటర్లకు చేరువలో భారత్‌ : ఇసి

Jan 23,2025 13:54 #election commision

న్యూఢిల్లీ : దేశంలో ఓటర్ల సంఖ్య వంద కోట్లకు చేరువ కానుందని ఎన్నికల సంఘం (ఇసి) వెల్లడించింది. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరిగిందని ఇసి వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో 96.88 కోట్ల ఓటర్లు వుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 99.1 కోట్లకు పెరిగిందని ఇసి లెక్కలు వెల్లడిస్తున్నాయి. జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ఎన్నికల సంఘం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 18- 29 సంవత్సరాల మధ్య వయసు గల ఓటర్లు 21.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఇసి ఈ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో ఎన్నికల లింగ నిష్పత్తి కూడా పెరిగిందని ఇసి పేర్కొంది. 2024లో 948 పాయింట్లుగా ఉన్న లింగ నిష్పత్తి 2025కల్లా 954కి చేరింది. ఆరుశాతం మేర లింగనిష్పత్తి పెరిగిందని ఇసి తెలిపింది.
కాగా, 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పాటైంది. ఇసి వ్యవస్థాయపక దినోత్సవం సందర్భంగా.. ప్రతి సంవత్సరం జనవరి 25న ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. వచ్చే నెల ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్‌ని ప్రకటించే ఒకరోజు ముందు (జనవరి 6వ తేదీ) భారత్‌లో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటిందని, త్వరలోనే వంద కోట్ల ఓటర్లు కలిగిన దేశంగా భారత్‌ రికార్డు సృష్టిస్తుందని చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు.

➡️