న్యూఢిల్లీ : అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డ్‌్ భారత్ రెండున్నర రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిఏటా రైసినా డైలాగ్స్ (బహుపాక్షిక సమావేశం) జరుగుతుంది. ఈ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్-అమెరికాల మధ్య ఆర్థిక సంబంధాన్ని బలోపేతం చేసే అవకాశం ఉంది. అమెరికా విధిస్తున్న టారిఫ్‌లపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఊహించాను. కానీ ప్రతికూలత కంటే.. సుంకాల పట్ల మరింత సానుకూలంగా భారత్ ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఏది మంచిదో, దేశ ప్రజలకు అందుబాటులో ఉన్న అవకాశాల గురించి ప్రధాని మోడీ పరిశీలిస్తున్నారు. మోడీ ఏవిధంగా ఉన్నారో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆ దేశ ఆర్థిక ప్రయోజనాలు, అమెరికన్ ప్రజల ప్రయోజనాల కోసం అదే చేస్తున్నారు. ట్రంప్-మోడీలు ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి మంచి పరిష్కారం కోసమే చూస్తున్నారు’ అని ఆమె అన్నారు.
