బంగ్లా, వియత్నాంలతో పోటీ పడలేకపోతోంది
ప్రపంచబ్యాంక్ నివేదిక
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా పురోభివృద్ధి సాధిస్తున్నప్పటికీ అంతర్జాతీయ వాణిజ్యంలో ఆ దేశపు వాటా పెరగడం లేదని ప్రపంచబ్యాంక్ పెదవి విరిచింది. ముఖ్యంగా తయారీ రంగంలో భారత్ వెనుకబాటులో ఉందని, ప్రత్యర్థులైన వియత్నాం, బంగ్లాదేశ్‌లు తక్కువ ఖర్చుతో వస్తువులు, సేవలను ఉత్పత్తి చేస్తూ వాటి ఎగుమతి కేంద్రాలుగా మారుతుంటే భారత్ ఆ దేశాలతో పోటీ పడలేకపోతోందని తెలిపింది. భారతదేశం ఆర్థికంగా పురోగమిస్తున్నప్పటికీ గత దశాబ్ద కాలంలో స్థూల దేశీయోత్పత్తిలో దాని వస్తువులు, సేవల వాణిజ్య వాటా పడిపోతోందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ప్రపంచబ్యాంక్ పేర్కొంది.
దుస్తులు, తోలు, వస్త్రాలు, పాదరక్షలకు సంబంధించిన అంతర్జాతీయ ఎగుమతుల్లో భారత్ వాటా 2013లో 4.5 శాతం ఉంటే 2022లో 3.5 శాతానికి పడిపోయింది. దీనికి భిన్నంగా బంగ్లాదేశ్ ఎగుమతులు 2022లో 5.1 శాతానికి, వియత్నాం ఎగుమతులు 5.9 శాతానికి చేరుకున్నాయని ప్రపంచబ్యాంక్ నివేదిక తెలియజేసింది. భారతీయ ఎగుమతి రంగాలు మూలధనపు ప్రోత్సాహకాలు అందజేస్తున్నప్పటికీ దేశంలోని లక్షలాది నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేకపోతున్నాయి. 2012లో ఎగుమతులకు సంబంధించిన రంగాలు మొత్తం ఉద్యోగాలలో గరిష్టంగా 9.5 శాతం కల్పిస్తే 2020లో 6.5 శాతం మాత్రమే కల్పించాయని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం అభివృద్ధిని సాధిస్తుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేస్తోంది. ఈ వృద్ధి 2025-26, 2026-27లో 6.7 శాతంగా ఉండవచ్చునని తెలిపింది.
