ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచీలో అట్టడుగున భారత ర్యాంకు

Oct 28,2024 07:16 #Environment, #India Rank

180 దేశాలలో 176వ స్థానం
న్యూఢిల్లీ : ప్రపంచ ప్రకృతి పరిరక్షణ సూచీ (గ్లోబల్‌ నేచర్‌ కన్జర్వేషన్‌ ఇండెక్స్‌) 2024లో భారత ప్రదర్శన దారుణంగా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలకు ఇందులో ర్యాంకులు కేటాయించగా.. భారత్‌ 176వ స్థానంలో ఉన్నది. 100కు గానూ 45.5 స్కోర్‌ మాత్రమే సాధించిన భారత్‌ అట్టడుగున నిలిచింది. ఈ జాబితాలో భారత్‌ తర్వాత స్థానాల్లో కిరిబాటి(180), టర్కీ(179), ఇరాక్‌ (178), మైక్రోనేషియా(177) దేశాలున్నాయి.
భూమి నిర్వహణ, జీవ వైవిధ్యం, పాలన, సామర్థ్యం, భవిష్యత్తు పోకడలు ఎదుర్కొంటున్న ముప్పులు వంటి అంశాలను ఈ సూచికలో పరిగణలోకి తీసుకుంటారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షను సమతుల్యం చేయటంలో ప్రతీ దేశం సాధించిన పురోగతిని ఇందులో అంచనా వేస్తారు. ఇజ్రాయెల్‌కు చెందిన బెన్‌-గురియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ నెగెవ్‌, లాభాపేక్షలేని వెబ్‌సైట్‌ బయోడీబీలు దీనిని రూపొందించాయి. జీవ వైవిధ్యానికి పెరుగుతున్న ప్రమాదాలు, భూమి అసమర్థ నిర్వహణ కారణంగా భారత్‌ అత్యల్ప ర్యాంకుకు కారణమని సూచీ పేర్కొన్నది. పట్టణ, పారిశ్రామిక, వ్యవసాయ అవసరాల కోసం భూమార్పిడి 53 శాతానికి చేరినందున స్థిరమైన భూ వినియోగ పద్దతులు అవసరమని పరిశోధకులు చెప్పారు. వ్యవసాయం, పట్టణీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధితో ఆవాసాలు కోల్పోవటం వంటి అనేక అంశాలు దేశ జీవ వైవిధ్యానికి ప్రమాదాలు కలిగిస్తున్నాయని కూడా వారు అన్నారు.
దేశంలో 2001 నుంచి 2019 మధ్య కొనసాగుతున్న అటవీ నిర్మూలన కారణంగా 23,300 చదరపు కిలోమీటర్లలో చెట్ల స్థలం పోయిందని పేర్కొన్నది. భారత్‌ భయంకరమైన జీవ వైవిధ్య సవాళ్లతో పాటు మంచి అవకాశాలనూ ఎదుర్కొంటున్నదని పరిశోధకులు చెప్పారు. 1970ల చివరి నుంచి రెట్టించిన జనాభా కారణంగా దేశ జీవవైవిధ్య సంపద నిరంతరం ముప్పులో ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు. స్థిరమైన అభివృద్ధికి తోడ్పడే నిబంధనలను తయారు చేయటం, పర్యావరణ పరిరక్షణకు నిధుల కేటాయింపు, సమర్థవంతమైన పరిరక్షణ చర్యలను ప్రోత్సహించటం ప్రభుత్వాల అంకితభావంపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.

➡️