- 300 కేజీల మాదకపదర్థాలు స్వాధీనం
- దాదాపు రూ.1800 కోట్ల విలువ
గాంధీనగర్ : గుజరాత్ తీరంలో మరొకసారి డ్రగ్స్ కలకలం రేపింది. రూ.1800 కోట్ల విలువైన 300 కేజీల మాదక పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్ (ఐసిజి), గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) అర్ధరాత్రి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ డ్రగ్స్‌ను సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయమైన సమాచారంతో ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. అనుమానాస్పద బోట్ కనిపించటంలో అక్కడికి సిబ్బంది వెళ్లింది. దీంతో అందులో డ్రగ్స్ మూటలతో ఉన్న దుండగులు సిబ్బంది రాకను గమనించారు. వెంటనే ఆ సరకును సముద్రంలో పడేశారు. ఆ వెంటనే అంతర్జాతీయ సరిహద్దు వైపు పారిపోయారు. డ్రగ్స్ ముఠా ఆటకట్టించటానికి వెళ్లిన సిబ్బంది వెంటనే నీళ్లలో మునిగిన ఆ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నది. 300 కేజీలకు పైగా నిషేధిత మెథాంఫెటమైన్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పట్టుబడిన ఈ డ్రగ్స్ విలువ రూ.1800 కోట్లను ప్రాథమికంగా అంచనా వేశారు.