- 10వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు, పది లక్షల ఉద్యోగాలు
- డబ్ల్యుఇఎఫ్ సమావేశాల్లో కేంద్ర మంత్రి ప్రకటన
డావోస్ : నాలుగు దేశాల యురోపియన్ బ్లాక్‌తో భారత్ కుదుర్చుకునే కొత్త వాణిజ్య, ఆర్థిక ప్రాతినిధ్య ఒప్పందం వల్ల భారత్‌లో వంద బిలియన్ల డాలర్ల విలువైన పెట్టుబడులు వస్తాయని, 10లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి బుధవారం తెలిపారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) వార్షిక సమావేశాల్లో భాగంగా ఆయన పలు సమావేశాల్లో పాల్గొన్నారు. నాలుగు యురోపియన్ దేశాలు, భారత్ కుదుర్చుకున్న వాణిజ్య, ఆర్థిక ప్రాతినిధ్య ఒప్పందం వచ్చే ఏడాది నుండి అమల్లోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. స్విస్ ప్రభుత్వం త్వరలోనే ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేయనుందని చెప్పారు. మొదట కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోనే నైపుణ్యాల అభివృద్ది అంశం వుండడం కీలకమైన సానుకూల పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నాలుగు దేశాలకు చెందిన నైపుణ్యాల అభివృద్ధి సంస్థలు, వాటి సిలబస్‌ను భారత యువతకు కూడా అందించనున్నట్లు తెలిపారు. అలాగే భారత్‌లో నేర్చుకున్న నైపుణ్యాలకు ఈ నాలుగు యురోపియన్ దేశాల్లో కూడా గుర్తింపు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఒప్పందం వల్ల వంద బిలియన్ల డాలర్ల పెట్టుబడులు వస్తాయన్నారు. పది లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు దేశంలో వస్తాయన్నారు.
కాలుష్యాన్ని తగ్గించేందుకు పారిశ్రామిక మండళ్ళు నిబద్ధత
ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) సదస్సులో మూడో రోజైన బుధవారం పారిశ్రామిక మండళ్ళ పరివర్తనా చొరవలో భాగంగా 16 దేశాలకు చెందిన 33 పారిశ్రామిక మండళ్ళు ఆర్థిక ప్రగతికి, ఉపాధి సృష్టికి, కాలుష్యాల కోతకు నిబద్ధతను ప్రకటించాయి. ఇందులో భారత్‌కు చెందిన ఐదు పారిశ్రామిక మండలులు వున్నాయి. ఒకపక్క ఆర్ధికాభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటూనే మరోపక్క కాలుష్య కారక వాయువులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ పారిశ్రామిక మండలులు ప్రతిన చేశాయి. ఈ 33 మండలులు తగ్గించగలమని ప్రతిన చేసిన కాలుష్య వాయువులు సౌదీ అరేబియా ఏటా విడుదల చేసే కాలుష్య వాయువులు 832 మిలియన్ల టన్నులకు సమానంగా వున్నాయని డబ్ల్యుఇఎఫ్ బుధవారం ప్రకటించింది.
అణ్వాయుధాలను వీడండి
అణ్వాయుధాల అభివృద్ధి తమ లక్ష్యం కాదని స్పష్టం చేయడం ద్వారా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలతో, అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఇరాన్ తొలి చర్య తీసుకోవాల్సి వుందని యుఎన్ చీఫ్ గుటెరస్ ఇరాన్‌ను కోరారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల మధ్య సంబంధాలు అన్నింటికంటే ముఖ్యమైన అంశమని ఆయన వ్యాఖ్యానించారు.