దేశవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత

Jan 13,2025 08:35 #Winter session

ఉత్తర భారతంలో పాఠశాలలకు సెలవులు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చలిగాలులు తీవ్రత భారీగా పెరిగింది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో చలిగాలుల తీవ్రత మరింత ఎక్కువైంది. దీంతో ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌ జిల్లాలో 8వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలకు జనవరి 18 వరకు సెలవులు ప్రకటించారు. చలి బారి నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్‌ ఇంద్ర విక్రమ్‌ సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పాఠశాల సిబ్బంది మాత్రం పాఠశాలలోనే ఉంటారు. ఉద్యోగులందరూ వారి కార్యాలయాలు, విభాగాలకు సంబంధించిన వారి బాధ్యతలను నిర్వర్తిస్తారని ఆదేశాలలో స్పష్టం చేశారు. ఘజియాబాద్‌ జిల్లాలో చలికాలం కారణంగా 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న అన్ని బోర్డు అనుబంధ పాఠశాలలను జనవరి 18 వరకు మూసివేయాలని జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారి ఆదేశించారు.
అన్ని పాఠశాలలు ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఆదేశాలు పాటించకుంటే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. 8వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలను జనవరి 11వ తేదీ వరకు మూసివేయాలని జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఆ ఉత్తర్వులను పొడిగించారు.

రానున్న 2, 3 రోజులు ఇదే పరిస్థితి
ఢిల్లీ, దేశరాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్‌) పరిధిలోని వాయువ్య భారతదేశంలో రాబోయే 2-3 రోజుల్లో చాలా దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దీంతో పాటు ఒక మోస్తరు పొగమంచు ఉంటుందని ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేశారు. చలి పెరుగుతుందని డిపార్ట్‌మెంట్‌ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఆర్డర్‌ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు వర్తిస్తుంది. అలాగే, నోయిడాలో కూడా 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మూసివేయబడతాయని అధికారులు ఆదివారం ప్రకటించారు. లక్నో పాఠశాలలు కూడా జనవరి 14, 2025 వరకు మూసివేయబడతాయి. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో సెషన్లు నిర్వహించనున్నారు. ఆగ్రా, మథురలలో 1 నుండి 8 తరగతుల పాఠశాలలు జనవరి 14, 2025 వరకు మూసివేయబడతాయని అనౌన్స్‌ చేశారు.
మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు జనవరి 1 నుంచి జనవరి 15, 2025 వరకు శీతాకాల సెలవులను ప్రకటించింది. ఈ ఆర్డర్‌ ప్రకారం తరగతులు మళ్లీ జనవరి 16, 2025న పున్ణప్రారంభించబడతాయి.

➡️