- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : అన్ని ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లోని పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి)లను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. 2013లో లైంగిక వేధింపుల నిరోధక (పిఒఎస్‌హెచ్) చట్టం అమల్లోకి వచ్చినా ఇప్పటికీ తీవ్రమైన లోపాలు నెలకొనడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వాల స్థాయిలో అధికారుల అలసత్వమే దీనికి కారణమని పేర్కొంది. జాతీయస్థాయిలో ఈ చట్టానికి అందరూ కట్టుబడి వుండేలా చూసేందుకు ఇటువంటి కమిటీల ఏర్పాటు అవసరమని స్పష్టం చేసింది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తునకు కమిటీలను ఏర్పాటు చేశారా? లేదా? అని నిర్దిష్ట కాలపరిమితిలో నిర్ధారించాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కావడం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా ఏకరీతిన అమలు కావాలని కోరింది. డిసెంబరు 31కల్లా ప్రతి జిల్లాలో ఒక ఆఫీసర్‌ను నియమించాలని, ఆ అధికారి వచ్చే ఏడాది జనవరి 31కల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని, తాలుకా స్థాయిల్లో నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించింది. పిఓఎస్‌హెచ్ చట్టంలోని సెక్షన్ 26 కింద ఐసిసి ఏర్పాటుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సర్వే నిర్వహించాలని డిప్యూటీ కమిషనర్లు లేదా జిల్లా మేజిస్ట్రేట్లను కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుకు వచ్చే ఏడాది మార్చి 31వరకు గడువు ఇచ్చింది. ఈ ఆదేశాల అమలును పర్యవేక్షించాలంటూ చీఫ్ సెక్రటరీలను ఆదేశించింది.