తొలిసారిగా ఇంటర్‌పోల్‌ ‘సిల్వర్‌ నోటీసులు’

Jan 11,2025 00:11 #First Interpol, #Silver Notices

న్యూఢిల్లీ : అంతర్జాతీయ పోలీస్‌ సహకార సంస్థ (ఇంటర్‌పోల్‌) మొట్టమొదటిసారిగా సిల్వర్‌ నోటీసులు జారీచేసింది. విదేశాల్లో అక్రమంగా పోగేసుకున్న ఆస్తుల వివరాల గుట్టువిప్పేందుకు వీలుగా ఇంటర్‌పోల్‌ కొత్తగా ఈ నోటీసులు తీసుకువచ్చింది. ఈ పైలట్‌ ప్రాజెక్టులో భారత్‌తో సహా 52 దేశాలు భాగస్వామ్యులుగా ఉన్నాయని తెలిపింది. ఒక మాఫియా సభ్యుడి ఆస్తులకు సంబంధించి ఇటలీ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు తొలిసారిగా వీటిని జారీ చేసినట్లు ఇంటర్‌పోల్‌ వెల్లడించింది. విదేశాలకు పారిపోయిన నేరస్థులు, ఆర్థిక నేరగాళ్లకు సంబంధించి కీలక సమాచారం కోసం ఆయా దేశాల నుంచి వచ్చే విజ్ఞప్తుల మేరకు కొన్ని నోటీసులను ఇంటర్‌పోల్‌ ఇప్పటికే జారీ చేస్తుంది. ఇప్పటి వరకూ రెడ్‌, ఎల్లో, బ్లూ, బ్లాక్‌, గ్రీన్‌, ఆరెంజ్‌, పర్పుల్‌ రంగులు వాడుతోన్న ఇంటర్‌పోల్‌.. తాజాగా సిల్వర్‌ను జోడించింది. ఉదాహరణకు విదేశాలకు పారిపోయిన వారిని నిర్బంధించాలని కోరేందుకు రెడ్‌ నోటీసులు ఉపయోగించడం మనకు తెలిసిందే. ఇంటర్‌పోల్‌లో భారత్‌ కూడా సభ్య దేశమే. మన దేశం నుంచి దాదాపు 10 మంది పారిపోయిన ఆర్థిక నేరస్తుల జాబితాలో ఉన్నారు. అయితే, వీరు విదేశాలకు తరలించిన మొత్తం నల్లధనం ఎంతనే విషయంపై కచ్చితమైన అంచనాలు లేవు. ఈ క్రమంలో నేరస్థులు ఇలా అక్రమంగా సరిహద్దులు దాటించిన సంపదను గుర్తించేందుకు సిల్వర్‌ నోటీసులు భారత్‌కు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. నేరస్థుల అక్రమ ఆస్తుల వివరాలకు సంబంధించి సిల్వర్‌ నోటీసు కోడ్‌తో ఇంటర్‌పోల్‌ ఇటీవల పైలట్‌ ప్రాజెక్టు చేపట్టింది. మోసం, అవినీతి, డ్రగ్‌ అక్రమ రవాణా, ఇతర తీవ్ర నేరాలతో సంబంధమున్న వ్యక్తుల కీలక సమాచారాన్ని గుర్తించి, ఆయా దేశాలకు అందిస్తుంది. ఫ్రాన్స్‌లోని లియోన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్‌పోల్‌లో ప్రస్తుతం 196 సభ్య దేశాలున్నాయి.

➡️