- గోయెల్ రాజీనామాపై అధికార వర్గాల్లో చర్చ
- బెంగాల్ పర్యటనలో తెరపైకి అభిప్రాయభేదాలు
- నేరుగా రాష్ట్రపతికి రాజీనామా లేఖ
- 15 కల్లా ఆ రెండు ఖాళీల భర్తీ !
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి మరి కొద్ది రోజులు మాత్రమే గడువు ఉండగా ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ తన పదవికి ఆకస్మికంగా, అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన నిర్ణయం అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించినప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్‌తో నెలకొన్న విభేదాల కారణంగానే గోయెల్ రాజీనామా చేశారని ఎన్నికల కమిషన్‌లోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఏప్రిల్, మే మాసాల్లో లోక్‌సభ ఎన్నికలతోబాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి.
మార్చి5న బెంగాల్‌లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోయెల్ పాల్గొనేందుకు నిరాకరించారని ఈ వర్గాలు తెలిపాయి. దీంతో సిఇసి ఒక్కరే ఆ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆరోగ్య కారణాలతో గోయెల్ ఢిల్లీకి తిరిగి పయనమయ్యారని సిఇసి వివరణ ఇచ్చారు. అయితే ఈ వాదనను గోయెల్ సన్నిహిత వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెప్పాయి. ‘కొన్ని తీవ్రమైన విభేదాల కారణంగానే గోయెల్ తన బెంగాల్ పర్యటనను కుదించుకొని ఢిల్లీ చేరుకున్నారు’ అని ఆ వర్గాలు తెలిపాయి.
15కల్లా ఇద్దరు ఎన్నికల కమిషనర్ల నియామకం
ఎన్నికల కమిషనర్ అనుప్ పాండే రిటైర్మెంట్, మరో ఎన్నికల కమిషనర్ గోయెల్ ఆకస్మిక రాజీనామాతో ఏర్పడిన రెండు ఖాళీలను మార్చి15 కల్లా భర్తీ చేసే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. న్యాయశాఖ మంత్రి, హో శాఖ, సిబ్బంది వ్యవహారాల శాఖ కార్యదర్శులతో కూడిన సెర్చ్ కమిటీ అయిదేసి పేర్లతో కూడిన రెండు వేర్వేరు జాబితాలను ప్రధాని, ఆయనచేత నియమించబడ్డ మంత్రి, ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ ముందుంచుతుంది. ఆ కమిటీ ఆ రెండు జాబితాల నుంచి ఇద్దరి పేర్లను ఎంపిక చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఎన్నికల కమిషనర్ల నియామకం కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించి, ఆయన స్థానంలో ప్రధాని చే నియమించబడిన మంత్రికి స్థానం కల్పించారు. దీంతో ఎన్నికల కమిషనర్ల నియామకంపై ప్రభుత్వం పూర్తిగా పట్టు బిగించింది.
ఇంతకీ ఏం జరిగింది..?
భారత ఎన్నికల సంఘంలోని ఈ ఇద్దరు అధికారుల మధ్య ఏం జరిగింది? ఆ విభేదాలు ఏమిటి? ఏయే అంశాలపై అభిప్రాయభేదాలు తలెత్తాయి? అనే విషయాలు తెలియడం లేదు. గోయెల్ సన్నిహిత వర్గాలు కానీ, ఇసి వర్గాలు కానీ దీనిపై పెదవి విప్పడం లేదు. ఈ నెల మిగతా 5లో 7న కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన సమావేశాలకు సిఇసితో పాటు గోయెల్ కూడా హాజరయ్యారు. కానీ ఆ మరునాడు ఎన్నికల ఏర్పాట్లపై ఇసి అధికారులు, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజరు కుమార్ భల్లా మధ్య జరిగిన సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. రాజీనామా విషయంలోనూ సిఇసికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్రపతికి తన రాజీనామా లేఖను పంపారు.
గోయెల్‌కు నచ్చచెప్పేందుకు, సిఇసితో ఆయనకు ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వైపు నుండి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఆయన తన పట్టు వీడలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గోయెల్ రాజీనామాను రాష్ట్రపతి శనివారం నాడు ఆమోదించిన విషయాన్ని న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. ఈ నోటిఫికేషన్ వెలువడే వరకు సిఇసికి, ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులకు తప్ప గోయెల్ రాజీనామా గురించి ఎవరికీ తెలియదు.అరుణ్ గోయెల్ 2022 నవంబరులో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వెంటనే ఎన్నికల కమిషనర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అప్పట్లో ఆయన నియామకం వివాదాస్పదం కాగా, ఇప్పుడు ఆయన రాజీనామా చర్చనీయాంశమైంది.
గోయెల్ ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటారని ఆయనతో కలసి పనిచేసిన అధికారులు చెబుతున్నారు. ఆయన రాజీనామా ఇసి స్వతంత్రతపై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోందని వారు అంటున్నారు. ఎన్నికల కమిషనర్‌గా నియామకం కావడానికి ముందు ఆయన ప్రభుత్వ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మరో ఎన్నికల కమిషనర్ అనుప్ చంద్ర పాండే పదవీకాలం గత నెలలోనే ముగిసినందున ఇప్పుడు కమిషన్‌లో ఒక్క రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు.
లావాసాను కేంద్రం వెంటాడింది
గోయెల్ రాజీనామాపై కేంద్రం వివరణ ఇవ్వాలిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో అప్పటి ఎన్నికల కమిషనరు లావాసా ప్రధాని ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, ఆయనపై చర్య తీసుకోవాలని కోరినందుకు, ఎన్నికలు ముగియగానే ఆయన నివాసాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని, దీంతో ఆయన ఎన్నికల కమిషనరు పదవికి రాజీనామా చేశారని కాంగ్రెస్ నేత విమర్శించారు. రాజ్యాంగ సంస్థల పనిలో ఎలాంటి పారదర్శకత ఉండడం లేదని ఆయన అన్నారు.