Akhilesh Yadav : గ్లోబల్‌ ఎకనామిక్‌ సూపర్‌పవర్‌గా మారడమంటే ఇదేనా ..!

లక్నో : ‘గ్లోబల్‌ ఎకనామిక్‌ సూపర్‌పవర్‌’గా అవతరించడం వలన ఉద్యోగులకు బకాయిలు రావడం లేదని సమాజ్‌ వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ బుధవారం ఎద్దేవా చేశారు. పెరుగుతూపోతున్న జిఎస్‌టి వసూళ్ల నగదు అంతా ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలని మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల కరువు భత్యం (డిఎ)ను చెల్లించేందుకు మోడీ ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే.

గ్లోబల్‌ ఎకనామిక్‌ సూపర్‌ పవర్‌గా అవతరించిందని మోడీ ప్రభుత్వం ప్రకటించడం వల్లే ఉద్యోగులకు బకాయిలు అందడం లేదా? అని ప్రశ్నించారు. వారి బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం నిరాకరించడం, ఓ విధంగా ప్రభుత్వ హామీని తిరస్కరించడమేనని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అలాగే ప్రకటనకు సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లను కూడా జత చేశారు.

‘‘జిఎస్‌టి వసూళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయో చెప్పాలి. ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కొనసాగుతుందా ? వేల కోట్ల విలువైన ఓడలకు, లీకేజీ భవనాలకు డబ్బు ఉంది కానీ అసలు ప్రభుత్వాన్ని నడిపించే ఉద్యోగులకు లేదు. ఓ వైపు ద్రవ్యోల్బణం, మరోవైపు కరువు భత్యం లభించకపోవడంతో పరిమిత ఆదాయం కలిగిన ఉద్యోగులపై రెట్టింపు దెబ్బ’’  అని అన్నారు.

చెల్లింపులు సరిగా లేకపోతే ఉద్యోగుల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. పనిచేసే వారికి బిజెపి సరైన జీతం ఇవ్వడం లేదని, వైద్య ఖర్చులు పెరుగుతున్న పింఛన్‌ ఇవ్వడం లేదని, వృద్ధులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

ఇప్పుడు ప్రభుత్వం పెన్షన్‌ కోసం సీనియర్‌ సిటిజన్లు నిరాహారదీక్ష చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందా? అని ప్రశ్నించారు. రైల్వే రాయితీలను నిలిపివేయడం ద్వారా సీనియర్‌ సిటిజన్‌లను అవమానించిందని ధ్వజమెత్తారు.

➡️