స్వతంత్ర జర్నలిజం గొంతునొక్కే ప్రయత్నమే

మీడియాలో ఆరోపణలను ఖండించిన న్యూస్‌క్లిక్‌
న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్‌ దర్యాప్తు చేస్తున్న యుఎపిఎ కేసుకు సంబంధించి మీడియాలో వస్తున్న ఆరోపణలన్నింటినీ న్యూస్‌క్లిక్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. చైనా నుంచి కానీ, చైనా సంస్థల నుంచి కానీ న్యూస్‌క్లిక్‌కు ఎలాంటి నిధులు లేదా ఆదేశాలు అందలేదని ఇప్పటికే తాము అనేకసార్లు చెబుతూ వచ్చామని తెలిపింది. న్యూస్‌క్లిక్‌ ఎలాంటి జాతి వ్యతిరేక కార్యకలాపాల్లో కూడా పాల్గనలేదని స్పష్టం చేసింది. వివిధ ప్రభుత్వ సంస్థలే న్యూస్‌క్లిక్‌పై పలుమార్లు ఇటువంటి ఆరోపణలు చేస్తూ వచ్చాయని తెలిపింది. ఈ ఆరోపణలకు సంబంధించి వారు ఎలాంటి సాక్ష్యాధారాలను కూడా అందచేయలేకపోయారని పేర్కొంది. తాజా వాదనలేవీ కూడా ఇందుకు భిన్నంగా లేవని వ్యాఖ్యానించింది. న్యూస్‌క్లిక్‌ చేసే కార్యకలాపాలన్నీ పబ్లిక్‌ డొమైన్‌లోనే వుంటాయని, న్యూస్‌క్లిక్‌పై చేస్తున్న ఆరోపణలను ఒక్కసారి పరిశీలించినా కూడా ఇదంతా స్వతంత్ర జర్నలిజం గొంతు నొక్కే ప్రయత్నమని స్పష్టమైపోతుందని వివరించింది. విచారణ సమయంలో ఈ ఆరోపణలన్నీ కూడా తోసిపుచ్చబడతాయని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపింది. తమ పని ఏమిటో నిరూపించబడుతుందని పేర్కొంది.
స్వతంత్రంగా వార్తా కథనాలు ఇచ్చే న్యూస్‌క్లిక్‌పై కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినా కేంద్రం మొండిగా వ్యవహరిస్తోంది. తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేసిన ప్రబీర్‌ పుర్కాయస్థను వెంటనే విడుదల చేయాలని, కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని పలు పాత్రికేయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

➡️