లక్నో : యూపీలో దారుణం జరిగింది. ధనవంతులు కావాలని నాలుగేళ్ల బాలికను బలి తీసుకున్నారు. ఈ కేసులో మంత్రగాడు, బాలిక బంధువును అరెస్టు చేశారు. బరేలీ సమీపంలోని శిఖర్‌పూర్ చధౌరీ గ్రామానికి చెందిన మిస్తీ అనే చిన్నారి మృతి చెందింది. చిన్నారి కనిపించడం లేదంటూ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. ఇంతలో హత్యకు సంబంధించిన సమాచారం బయట పడింది. శనివారం షికార్‌పూర్ చౌదరి గ్రామంలోని తన ఇంటి నుంచి బాలిక కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఇసాత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బంధువుల ఇంటి నుంచి బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కేసు విచారణ జరుగుతున్న సమయంలో చిన్నారి బంధువు సావిత్రి అసభ్యంగా ప్రవర్తించింది. చిన్నారి తల్లిదండ్రులను కూడా ఇంట్లోకి రానివ్వని పరిస్థితి రావడంతో పోలీసులు సావిత్రి ఇంట్లో సోదాలు చేశారు. ఆ సమయంలో బావి దగ్గర గోనె సంచిలో కట్టి ఉన్న చిన్నారి మృతదేహం కనిపించింది. సావిత్రి, మంత్రగాడు గంగారాం కలిసి చిన్నారిని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.