న్యూఢిల్లీ : వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రతిపక్ష ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతి లేకుండా ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ ప్రజెంటేషన్లు ఇచ్చేందుకు ఆదేశాలు జారీచేయడం చట్ట విరుద్ధమని వాదించారు. వక్ఫ్ బోర్డ్ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధీనంలో ఉంటుందని, ఆ మంత్రి వర్గం ఎన్నికైన ప్రభుత్వం కింద పనిచేస్తుంది. దీంతో వక్ఫ్ బోర్డ్‌కు సమర్పించే ఏ నివేదికైనా ప్రభుత్వం నుండి ఆమోదం పొందవలసి ఉంటుంది. అయితే దానిని ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ సిఇఒ పట్టించుకోలేదని ఎంపిలు వాదించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత, ఢిల్లీ ప్రభుత్వం నుండి ఎలాంటి ఆమోదం లేకుండానే, ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ అభిప్రాయాలు, సూచనలను రికార్డ్ చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఆమోదించడం గమనార్హం.
నేటి సమావేశంలో వక్ఫ్ బిల్లు పై వారి అభిప్రాయాలను నమోదు చేయడానికి కమిటీ హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్‌ల నుండి ప్రతినిధులను పిలిచింది. ఈ బిల్లుపై చర్చించడానికి మరియు వారి మౌఖిక సాక్ష్యాలను నమోదు చేయడానికి ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ , మైనారిటీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు మంగళవారం కూడా సమావేశమయ్యారు.
వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై సోమవారం జెపిసి ఛైర్మన్, బిజెపి ఎంపి జగదాంబిక పాల్ అధ్యక్షతన జరిగిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం నుండి ప్రతిపక్ష ఎంపిలు వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.