- నిబంధనలకు విరుద్ధగా రాజకీయాలతో సభ నడుపుతున్నారు
- అందుకే ఆయనను తొలగించేందుకు అవిశ్వాసం
- విలేకరుల సమావేశంలో ప్రతిపక్షాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా రాజకీయాలతో సభ నడుపుతున్నారని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఆయన నిబంధనల కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే జగదీప్ ధన్‌ఖర్‌పై అవిశ్వాస తీర్మానం ఇచ్చామని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. బుధవారం నాడిక్కడ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రతిపక్ష నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ధన్‌ఖర్ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారని, అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నేతలను సభలో మాట్లాడకుండా తరచూ అడ్డుకుంటున్నారని విమర్శించారు. ”ఉపరాష్ట్రపతి పదవి రాజ్యాంగ బద్ధంగా రెండోది. ఇంతవరకు ఉపరాష్ట్రపతి పదవి నుండి తొలగించే తీర్మానం ఎన్నడూ తీసుకురాలేదు. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న వారందరూ ఎప్పుడూ రాజకీయంగా లేరు. కానీ నేడు పార్లమెంటులో రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పవలసి వచ్చింది. మేము నిరాశ చెందాం. అధికార పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు జోక్యం చేసుకోరు. అదే ప్రతిపక్ష సభ్యులు మాట్లాడితే వెంటనే జోక్యం చేసుకుంటారు. కొన్నిసార్లు తనను తాను ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తినని పేర్కొంటారు. నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు” అని ఖర్గే అన్నారు. ”సభా నాయకుడు మాట్లాడినప్పుడు ఎంత అవకాశం ఇస్తారో, ప్రతిపక్షనేతగా తాను మాట్లాడినప్పుడు కూడా అంతే అవకాశం ఇవ్వాలి. అదే రూల్ చెబుతోంది. కానీ చైర్మన్ అలా చేయరు. అతని ప్రవర్తన దేశ గౌరవాన్ని దెబ్బతీసింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో ఆయన అలాంటి పరిస్థితిని తెచ్చిపెట్టారు. అందుకే అవిశ్వాసం తీర్మానం తీసుకురావాల్సి వచ్చింది’ అని అన్నారు. ‘ప్రతిపక్ష పార్టీలను బహిరంగంగా విమర్శించి, అధికార పక్షానికి అధికార ప్రతినిధిలా ప్రవర్తించే ఉపరాష్ట్రపతి మన చరిత్రలోనే తొలిసారి చూస్తున్నాం. గత మూడేళ్లుగా క్లిష్టమైన సమస్యలను లేవనెత్తడానికి సమయం ఇవ్వకుండా, సీనియర్ సభ్యులను సైతం తక్కువ చేసి మాట్లాడారు” అని ఖర్గే అన్నారు. ”1952 నుండి ఉప రాష్ట్రపతి ఎన్నడూ రాజకీయాలలో పాల్గొనలేదు. అందుకే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ఆర్టికల్ 67 కింద తీసుకురాలేదు” అని అన్నారు.
నిష్పాక్షపాతంగా వ్యవహరించాలి: బికాష్ రంజన్ భట్టాచార్య
రాజ్యసభ చైర్మన్ నిష్పాక్షపాతంగా వ్యవహరించాలని, రాజ్యాంగ పరిషత్ చర్చలో కూడా ఇదే స్పష్టం చేశారని సిపిఎం రాజ్యసభ ఎంపి బికాష్ రంజన్ భట్టాచార్య పేర్కొన్నారు. చైర్మన్ ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారని, ఆర్‌ఎస్‌ఎస్‌ను కీర్తిస్తున్నాడని విమర్శించారు. ఈ అవిశ్వాస తీర్మానాన్ని సంతోషంగా తీసుకురావటం లేదని, దుఃఖంతోనే తీసుకువస్తున్నామని అన్నారు. అయితే రాజ్యాంగం దాడికి గురవుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకమైన తరుణంలో తాము అలా చేయవలసి వచ్చిందని అన్నారు. చైర్మెన్ అధికార పక్షం వైపు మొగ్గు చూపుతున్నారని, అందుకే ఈ తీర్మానానికి సిపిఎం మద్దతు ఇచ్చిందని తెలిపారు.
ఆయన సర్కస్ నడుపుతున్నారు: సంజయ్ రౌత్
చైర్మన్ ధన్‌ఖర్ నడుపుతున్నది రాజ్యసభను కాదని, సర్కస్ అని శివసేన ఎంపి సంజరు రౌత్ ధ్వజమెత్తారు. ‘నేను నలుగురు చైర్మన్‌లను చూశాను. కానీ నేను ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి చూడలేదు” అని అన్నారు.
ప్రజాస్వామ్య రక్షణకే : మనోజ్ ఝా
ఆర్‌జెడి ఎంపి మనోజ్ ఝా మాట్లాడుతూ ప్రజాస్వామ్య రక్షణ కోసమే తమ పోరాటమన్నారు. ”మా ఈ ప్రయత్నం ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదు. కానీ ఒక సంస్థ ఆలోచనలు, మాటలు, చర్యలలో దాని ప్రవర్తనను పునరుద్ధరించే ప్రయత్నం” అని అన్నారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి దెబ్బ’: తిరుచ్చి శివ
డిఎంకె ఎంపి తిరుచ్చి శివ మాట్లాడుతూ సభలో ధన్‌ఖర్ వ్యవహారిస్తున్న తీరు ప్రజాస్వామినికి దెబ్బ అని అన్నారు. ఆయన ధోరణి అధికార పక్షానికి అనుకూలంగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఫౌజియాఖాన్ (ఎన్‌సిపి), జావేద్ అలీఖాన్ (ఎన్‌సిపి), సర్ఫరాజ్ అహ్మద్ (జెఎంఎం), నదిముల్ హక్ (టిఎంసి), సంతోష్ కుమార్ (సిపిఐ), కె.ఎం మణి (కేరళ కాంగ్రెస్), జాన్ బ్రిట్టాస్ (సిపిఎం) తదితరులు మాట్లాడారు.