Jairam Ramesh : జిడిపి వృద్ధి గణాంకాలు.. ఊహించిన దానికంటే దారుణంగా ఉన్నాయి

Nov 30,2024 14:02 #gdp, #Ramesh

న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 5.4 శాతానికి పడిపోయిందని కేంద్ర గణాంకాల శాఖ శుక్రవారం విడుదల చేసిన వివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో జిడిపి వృద్ధిరేటు ఊహించిన దానికంటే దారుణంగా పడిపోయిందని శనివారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైంరాం రమేష్‌ వ్యాఖ్యానించారు. ఇదేక్రమంలో వినియోగం 6 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆరోపించారు. జిడిపి పడిపోవడానికి ప్రధాన కారణం.. కార్మికుల వేతనాల్లో పెరుగుదల లేకపోవడమేనని.. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం వాస్తవాలను గుర్తించడం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ప్రజల్లో హైప్‌ని సృష్టించారని ఈ మేరకు ఆయన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, జిడిపి తగ్గడానికి గల కారణాలపై నరేంద్ర మోడీ, ఆయన చీర్‌లీడర్‌లు ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు. అయితే ముంబైకి చెందిన ప్రముఖ ఆర్థిక సమాచార సేవల సంస్థ నవంబర్‌ 26వ తేదీన విడుదలన చేసిన ‘ లేబర్‌ డైనమిక్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌’ తాజా నివేదిక జిడిపి పడిపోవడానికి గల అసలు కారణాన్ని వెల్లడిస్తోంది. ఆ నివేదికలో కార్మికుల వేతనాల్లో పెరుగుదల లోపించిందని స్పష్టంగా తెలియజేస్తోందని రమేష్‌ అన్నారు. మొత్తంగా నిజవేతనం వృద్ధి గత ఐదేళ్లలో జాతీయ స్థాయిలో 0.01 శాతం పడిపోయిందని తాజా నివేదిక తెలిపింది. ఈ ఐదేళ్లలో హర్యానా, అస్సాం, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోని కార్మికుల నిజ వేతనాలు తగ్గాయి. ప్రతి భారతీయుడు గత పదేళ్ల క్రితం కంటే.. ఇప్పుడు తక్కువగా కొనుగోలు చేసే పరిస్థితిలో ఉన్నాడు. ఇదే జిడిపి మందగమనానికి కారణం అని ఆయన స్పష్టం చేశారు.

 

➡️